BJP Leader Bandi Sanjay Going To Delhi: బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిల్లీ చేరుకున్నారు. ఆయన హుటాహుటిన హస్తిన వెళ్లడంతో.. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కీలక నిర్ణయాలు ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధానిలో పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే తాజాగా బండి సంజయ్ వెళ్లడంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను పార్టీలో చేర్చుకునేందుకు చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్‌పై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వ్యవహరించిన తీరుపై.. కూడా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఫైల్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విధానంపై కూడా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
నిన్న దిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్: బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పడ్డారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాలో పేరున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటితో మంతనాలు జరుపుతున్నారు. ఆ వెంటనే పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో మంగళవారం హుటాహుటిన దిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ చేరికల అంశంపైనే జాతీయ నేతలతో చర్చించడానికి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన రెండు రోజుల పాటు దిల్లీలోనే ఉండనున్నారు. గురువారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని ఈటల రాజేందర్ సన్నిహితులు చెపుతున్నారు.
అంతకు ముందు జూపల్లికి ఈటల, డీకే అరుణ ఫోన్ చేసి బీజేపీలో చేరాలని కోరారు. అందుకు పార్టీ కార్యకర్తలతో చర్చలు జరిపి తన వివరణను ఇస్తానని ఆయన తెలిపినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సైతం ఇలానే వారు మాట్లాడారు. మరి వీరు కాంగ్రెస్ పార్టీలో చేరతారా.. లేక బీజేపీ కండువా కప్పుకుంటారా.. లేకపోతే వేరే పార్టీ పెడతారా అనేది వేచి చూడాలి.
ఇవీ చదవండి: