Bandi Sanjay Fires on CM KCR : భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యవర్గ సమావేశాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో సింగల్‌గా పోటీ చేస్తామని.. అధికారం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే..: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌కు కేసీఆర్ నిధులు సమకూర్చారని బండి సంజయ్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదన్న ఆయన.. అక్కడ బీజేపీ ఓటు శాతం తగ్గలేదని పేర్కొన్నారు. జేడీఎస్ ఓట్లను బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్‌కు మళ్లించారని తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని ధ్వజమెత్తారు. అలాంటిది బీఆర్ఎస్కు.. కాంగ్రెస్ ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుందని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని బండి సంజయ్ పునరుద్ఘాటించారు.
'బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకే కేసీఆర్ కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని గెలిచింది. నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని గెలిచింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. మునుగోడులో కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ డబ్బులు పంచింది. కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం లేకుండా పోయింది. కుటుంబ పాలన వల్ల రాష్ట్రంలో అభివృద్ది జరగట్లేదు.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బండి సంజయ్ తెలిపారు. 30 రోజుల పాటు మోదీ విజయాలను, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. గత 9 ఏళ్లలో బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు.
'గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా సమయంలో మోదీ విధానాల వల్లే భారత్ నిలబడింది. లాక్‌డౌన్ విధించి దేశ ప్రజల ప్రాణాలు కాపాడింది ప్రధాని మోదీ. ఉచితంగా కొవిడ్ టీకాలు పంపిణీ చేసి.. దేశ ప్రజల ప్రాణాలు కాపాడింది మోదీ. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఫీజు రీయింబర్స్మెంట్, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం, 2 లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపడతాం.' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, సునీల్ బన్సల్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకట స్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మురళీధర్ రావు, తదితరులు హాజరయ్యారు.
ఇవీ చదవండి: