Bandi Sanjay Respond to ED Notices Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కవిత నోటీసులకు, తెలంగాణ సమాజానికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ఈడీ విచారణకు పిలిస్తే నిర్దోషి అని నిరూపించుకోండని సూచించారు. కోర్టులు కొడతాయా అని గతంలో కేసీఆరే అన్నారని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలకు, బీజేపీకి ఏం సంబంధం? అని అడిగారు.
కాంగ్రెస్ హయాంలోనూ ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయని బండి సంజయ్ గుర్తు చేశారు. కవిత వల్ల తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయంపై.. కేసీఆర్, కేటీఆర్‌లు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబం చేతిలో ప్రజలు మోసపోవడానికి సిద్దంగా లేరని తెలిపారు. కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా చేస్తూ.. తెలంగాణ సమాజం తలవంచదంటే నవ్వొస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
కవిత కేసు విషయంలో బీజేపీకి సంబంధం లేదు: కవిత కేసు విషయంలో బీజేపీకి సంబంధం లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తప్పు చేసినా వారిపై చట్టప్రకారం దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయని వివరించారు. ఈ క్రమంలోనే మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత బీఆర్ఎస్కు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్లో మహిళ విభాగమే లేదని.. మహిళ అధ్యక్షురాలు ఎవరో తెలియదని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్సీ ఇవ్వరా అని ప్రశ్నించారు. తొలి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని? బండి సంజయ్ తెలిపారు.
కవిత తప్పు చేసింది అందుకే ఈడీ నోటీసులు ఇచ్చింది: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పించుకోలేరని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో మాట్లాడారని గుర్తు చేశారు. కవిత తప్పు చేసింది కాబట్టే.. ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. తప్పు చేసిన వారు మహిళలైనా.. పురుషులైనా శిక్ష పడటం ఖాయమని స్పష్టం చేశారు. మహిళలకు ఎక్కడైతే గౌరవం దొరుకుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి బీజేపీ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఈటల రాజేందర్ వివరించారు.
తెలంగాణ సమాజంపై వచ్చినట్లుగా చిత్రీకరించడం సబబు కాదు: కల్వకుంట్ల కుటుంబంలో ఎవరిపై ఆరోపణ వచ్చినా.. అది మొత్తం తెలంగాణ సమాజంపై వచ్చినట్లుగా చిత్రీకరించడం సబబు కాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దర్యాప్తు సంస్థలు వారి పని వారు చేసుకుంటే.. బీజేపీకి ఏమిటి సంబంధమని ప్రశ్నించారు. కవితకు నోటీసులు వస్తాయని ముందే తెలిసినా.. మహిళా చట్టంపై ధర్నా అని కొత్త రాగం అందుకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు చర్యలకు మీరు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందరూ మీ లాగే ఉంటారని అనుకుంటున్నారా అని.. కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులన్ని.. కక్ష సాధింపేనా అని డీకే అరుణ నిలదీశారు.
"కవిత నోటీసులకు, తెలంగాణ సమాజానికి ఏం సంబంధం?. ఈడీ విచారణకు పిలిస్తే నిర్దోషి అని నిరూపించుకోండి. కోర్టులు కొడతాయా అని గతంలో కేసీఆరే అన్నారు. దర్యాప్తు సంస్థలకు, బీజేపీకి ఏం సంబంధం?. కాంగ్రెస్ హయాంలోనూ ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. కవిత వల్ల తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్, కేటీఆర్‌లు కవిత విషయంపై ఎందుకు స్పందించలేదు." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో MLC కవితకు ఈడీ నోటీసులు
కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదు: ఎమ్మెల్సీ కవిత
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం.. మంత్రివర్గంలోకి 8 మంది