ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పీఆర్సీ ఎట్లా ఇస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మంత్రి కేటీఆర్కు ఎందుకని ప్రశ్నించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను పట్టభద్రుల ఆశీర్వాదంతో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయని బండి వెల్లడించారు.
తెరాసను ఎందుకు గెలిపించాలి..
అహంకారపూరితంగా ఓట్లు అడగని కేసీఆర్కు ఓటెందుకు వేయాలో ఆలోచించించుకోవాలని పట్టభద్రులకు సూచించారు. రాష్ట్రంలో అజాంజాహీ మిల్లు, నిజాం చక్కెర కర్మాగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. ఓయూ, కేయూలను నిర్వీర్యం చేసి నలుగురు అనుచరులకు ప్రైవేటు యూనివర్సిటీలను కట్టబెట్టారని దుయ్యబట్టారు. అభివృద్ధిపై చర్చకు రావాలని కేసీఆర్కు అనేక సార్లు సవాల్ విసిరినా ఇప్పటి వరకు రాలేదని ఎద్దేవాచేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే ఎన్నికల హామీలు నెరవేరుతాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయాన్ని కాంక్షిస్తూ పలు పార్టీల ర్యాలీలు