గణేష్ ఉత్సవాల నిర్వహణపై తెరాస ప్రభుత్వ కుట్రలను దీటుగా ఎదుర్కొంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో రంజాన్‌కు బిర్యానీలు, కాజు, పిస్తాలు అందించిన తెరాస ప్రభుత్వం... గణేష్ ఉత్సవాలకు కనీసం పులిహోర నైవేద్యాన్ని సమర్పించే అవకాశాలు కల్పించకుండా ఆంక్షలు పెడుతోందని మండిపడ్డారు. ఓవైసీ సోదరుల చేతుల్లో కీలుబొమ్మగా మారి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టించడం కేసీఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకే గణేశ్ ఉత్సవాలపై అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. లోపాయికారి అవగాహనతో కలిసి కుట్రలు చేస్తున్న తెరాస, ఎంఐఎం పార్టీలకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ధార్మిక సంస్థలు,హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు, పోలీసుల నుంచి ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బందులు, బెదిరింపులు ఎదురైతే స్థానిక హిందూ ధార్మిక సంస్థలను, భాజపాను సంప్రదించాలన్నారు.