BJP street corner meeting concluding program: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలే మా నాయకులకు భరోసా ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆ పార్టీ నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్ 18 రోజుల వ్యవధిలో 11 వేల 123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను నిర్వహించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించామని హర్షం వ్యక్తం చేశారు.
సమావేశాలు విజయవంతం చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా అగ్ర నేతలు అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశాల విజయానికి కృషి చేసిన నేతలను, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లను సహా కమిటీ సభ్యులందరినీ బండి సంజయ్, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో మాట్లాడిన స్ట్రీట్ కార్నర్ కో ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్లు.. బూత్ స్థాయి కార్యకర్త మొదలు జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమావేశాల్లో భాగస్వామ్యులయ్యారని పేర్కొన్నారు. ఈ సభల ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని వివరించారు. మొత్తం 9వేల 224 శక్తి కేంద్రాలకుగాను 11 వేల 123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించడం గొప్ప విషయమని ఆయన తెలిపారు.
Election strategy of BJP in Telangana: స్థానిక నేతల్లో పార్టీ పట్ల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ మీటింగ్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోనూ కాషాయ జెండాలు రెపరెపలాడాయని బండి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల ప్రారంభ, ముగింపు సభలను ఇంత ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ మీటింగ్స్ భవిష్యత్ కార్యక్రమాలకు మోడల్‌గా నిలిచేలా చేయడం ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణలో అధికారం లక్ష్యంగా బీజేపీ తగు వ్యూహాలు రచిస్తోంది. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ ఈనెల 4 నుంచి 6 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు శక్తి కేంద్రాల వారీగా సమావేశాలు నిర్వహించి.. మార్చి 12 నుంచి 20 వరకు బూత్ సశక్తీకరణ్ అభియాన్ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి:
కవిత దందాలతో రాష్ట్ర మహిళలు తల దించుకునే పరిస్థితి: బండి సంజయ్
తానున్నన్ని రోజులు పోచారం బాన్సువాడ ప్రజలకు సేవ చేయాల్సిందే: సీఎం కేసీఆర్