ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే భాజపా కార్యకర్తల కాళ్లు విరిగేలా దాడి చేస్తారా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay today news) ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన కిసాన్ మోర్చా నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే కార్యకర్తల కాళ్లు విరిగేలా దాడి చేస్తారా? అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. పోలీసుల దాడిలో కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఒక నాయకుడి కాలు విరిగిందని... ఇంకో నాయకుడి మెడపై తీవ్ర గాయం అయిందన్నారు. గాయపడ్డ కార్యకర్తలను తక్షణమే ఆస్పత్రికి తరలించాలని... అరెస్ట్ చేసిన వందలాది మంది కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా కిసాన్ మోర్చా నేతలు ముట్టడి
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయాన్ని.. భాజపా కిసాన్ మోర్చా నేతలు ముట్టడికి యత్నించారు. వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ.. డిమాండ్ చేశారు. కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి.. ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు.. నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా గృహనిర్బంధం
వరిసాగుపై కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా... సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి భాజపా పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో భాజపా నేతలు, కార్యకర్తలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేటలో భాజపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 300 మందిని అదుపులోకి తీసుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు (MLA Raghunandan Rao)ను హైదరాబాద్‌లోని తన నివాసంలో నార్సింగి పోలీసులు గృహనిర్బంధం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఎన్ని నిర్భందాలు విధించినప్పటికీ... కలెక్టరేట్ ముట్టడి చేస్తామని ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గృహనిర్బంధం