ముఖ్యమంత్రి కేసీఆర్.. హుజూరాబాద్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభను కవర్ చేసేందుకు మీడియాను అనుమతించకపోవడాన్ని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. గతంలో సిరిసిల్లలో జరిగిన సభలో కూడా జర్నలిస్టులను అనుమతించలేదని దుయ్యబట్టారు. దళిత బంధు పథకాన్ని కేసీఆర్ నిజంగా చిత్తశుద్ధితో, పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తే హుజూరాబాద్ బహిరంగ సభకు మీడియాను, కెమెరాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. వారిని అనుమతించడం లేదంటే ఏమనుకోవాలి అని ప్రశ్నించారు.
బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ మీడియా గొంతు నొక్కేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు. అధికార బలంతో మీడియా గొంతును నొక్కగలరేమో కానీ.. ప్రజల గొంతును నొక్కలేరని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెరాసకు బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: BANDI SANJAY KUMAR: 'కేసీఆర్ ఎన్నికలప్పుడే బయటికొస్తారు.. అప్పుడే హామీలిస్తారు'