సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న గోవధపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బండి అసహనం వ్యక్తం చేశారు. గోవులను వధించే వారికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలికితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
హిందువులు ఆరాధ్య దైవంగా భావించే గోమాతపై అమానుషంగా వ్యవహరించడం, వాటిని వేరే ప్రాంతాలకు తరలించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను గోవధ శాలకు తరలిస్తున్న హిందూ వ్యతిరేక శక్తులను అడ్డుకుంటున్న భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. ఆవులను చంపుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బక్రీద్‌ను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. కానీ పండుగ పేరిట గోవులను వధిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యాగాలు, హోమాలు చేసే సీఎం కేసీఆర్.. ఆవులను చంపుతున్నా పట్టించుకోకపోవడమేంటని ప్రశ్నించారు.
చట్టాన్ని అమలు చేయాలి
రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీకి భయపడి గో రక్షణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఓ వైపు శాంతి భద్రతలను కాపాడాలని భాజపా ప్రయత్నం చేస్తుంటే.. మరో వైపు కేసీఆర్ మాత్రం శాంతిభద్రతా సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
భజరంగ్‌దళ్ కార్యకర్త సంజయ్‌పై దాడిని ఖండిస్తున్నా. చట్టాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న వారిని ప్రభుత్వం అరెస్టులు చేయడం అమానుషం. ఎంఐఎం పార్టీ మద్దతు కోసమే సీఎం కేసీఆర్.. చట్ట వ్యతిరేకులకు అండగా ఉంటున్నారు. గోవధ జరుగుతుంటే భాజపా చూస్తూ ఊరుకోదు.
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
గోవధకు ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటు: బండి సంజయ్
వారి కనుసన్నల్లోనే
గోవులను వధించే వారికి సీఎం కేసీఆర్ వత్తాసు పలకడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో గోవధను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకులను కాకుండా చట్టాన్ని కాపాడే వారినే ప్రభుత్వం శిక్షిస్తోందని ఆక్షేపించారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి, డీజీపీ కనుసన్నల్లోనే నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. గో సంరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: Krishna Board: కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ
REVANTH: కర్ణాటక కాంగ్రెస్ నేతలను కలిసిన రేవంత్‌రెడ్డి.. అందుకోసమేనా!