Bandi Sanjay padayatra schedule: ఈ నెల 28 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. బాసరలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి. వీరేందర్ గౌడ్ వెల్లడించారు. డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు సాగే పాదయాత్రలో నిర్మల్, ఖానాపూర్, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి మీదగా సాగి.. కరీంనగర్‌లో ముగింపు సభ ఉంటుందని తెలిపారు.
కేసీఆర్ కుటుంబ అవినీతి నియంత పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఇప్పటి వరకు 4 విడతలుగా పాదయాత్ర చేసి 13ఎంపీ, 48అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు.. 21జిల్లాల్లో 1178కి.మీ సాగినట్లు వీరేందర్ గౌడ్ వివరించారు. పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయని.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని సంకేతాలు వెలువడ్డాయని పేర్కొన్నారు.
ప్రజాగోస- భాజపా భరోసా యాత్ర: అదే విధంగా రాష్ట్ర ముఖ్యనేతలు పాల్గొనే ‘ప్రజాగోస-భాజపా భరోసా యాత్ర’ పేరిట బైక్‌ర్యాలీలు ఈనెల 26న ప్రారంభం కానున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ కార్యక్రమాల్ని మంగళవారం ఖరారుచేసింది.
- బైక్ ర్యాలీలు ఒక్కో లోక్‌సభ పరిధిలో ఒకట్రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగుతాయని యాత్ర ఇన్‌ఛార్జి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. మెదక్, దుబ్బాక, అందోలు, జహీరాబాద్, గద్వాల, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, షాద్‌నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్ధన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో 200 బైక్‌లతో ర్యాలీలతో పాటు అన్నిగ్రామాల్లో స్థానిక సమస్యలపై సభలు నిర్వహిస్తామన్నారు.
- రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు పూర్తి సమయం ఇచ్చి పనిచేసే కొత్త విస్తారక్‌లను నియమించాలని భాజపా నిర్ణయించింది.
- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 4,5 వేల మందిని కొత్త ఓటర్లుగా నమోదు చేయించాలని నేతలకు పార్టీ సూచించింది.
- రైతులకు రూ.లక్ష రుణమాఫీ, ధరణి సమస్యల పరిష్కారానికి డిసెంబరు 9న కలెక్టరేట్ల ముందు ధర్నా చేపట్టాలని తెలిపింది.
ఇవీ చదవండి: