భైంసా అల్లర్ల బాధితులను భాజపా మాత్రమే మానవత్వంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ అల్లర్లకు కారణం ఎంఐఎం పార్టీనే అని వెల్లడించారు. భైంసాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపించిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అక్కడ భరోసా యాత్ర చేపడతామని హెచ్చరించారు.
పక్షపాతంగా...
పట్టణంలోని ఆరు ప్రాంతాల్లో ఓ పథకం ప్రకారమే ఏకకాలంలో దాడులు జరిగాయని వెల్లడించారు. ఈ ఘటనలో విజయ్, దేవారెడ్డిలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బండి పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం ఓ వర్గాన్ని వెనుకేసుకొస్తోందని ఆరోపించారు. పేదవాళ్ల ఇళ్లను దుండగులు దగ్ధం చేసినా కూడా సీఎం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: భైంసా ఘటనలపై అమిత్‌షాకు ఫిర్యాదు చేశాం : అర్వింద్