హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం మళ్లీ కొలువుల భర్తీ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp State President Bandi Sanjay) ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కాగానే ఉద్యోగాలు వస్తాయనుకున్న సమయానికి సంబంధం లేకున్నా కమల్‌నాథన్ కమిషన్‌ని సాకుగా చూపారని మండిపడ్డారు. ఉద్యోగ ఖాళీల సంఖ్యపై స్పష్టత లేదంటూ దాటవేస్తూ... చివరికి ఉద్యోగాలు ఇవ్వలేం అనే పరిస్థితికి తీసుకొచ్చారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఏడేండ్లుగా అల్లాడిపోతున్న నిరుద్యోగుల కోసం ఎందుకు మీ మనసు తండ్లాడటంలేదని.. వాళ్ల బతుకుల గురించి ఎందుకు ఆలోచిస్తలేరని ప్రశ్నించారు. అసలు టైం బాండ్ లేకుండా ఉద్యోగాల భర్తీ చేసే సామర్థ్యం తెరాస సర్కారుకు ఉందా అని విమర్శించారు. అసలు జాబ్ క్యాలెండర్ ఎలా ఉండాలన్న విషయంపైన రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టతలేదన్నారు.
కొత్తగా జిల్లా, జోన్లు, మల్టీజోన్లు, స్టేట్ బేసిస్లో కొలువుల భర్తీ అంటూ తేనెతుట్టెను కుదిపారని దుయ్యబట్టారు. జోనల్ విధానం అమలులో ఉందని తెలిసికూడా ఏడేండ్లుగా ఏ చర్య తీసుకోకుండా ఇప్పుడు జిల్లా పోస్టులు, జోనల్ పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులంటూ కాలయాపన చేయడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికల్లో సైతం 50 వేల ఉద్యోగాలు ఇస్తున్నామంటూ ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. అవి ఇంతవరకు కార్యాచరణకు పూనుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని.. అధికారులను పూర్తి స్థాయిలో భర్తీ చేయని కారణంగా ఇంఛార్జీలతో కాలం వెళ్లదీస్తుండడం వల్ల పాలన కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: CABINET MEET: రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. ఉద్యోగాల భర్తీపై చర్చ