bandi sanjay comments on brs government: ఎనిమిదేళ్ల క్రితం నందినగర్‌లో ఇల్లు మాత్రమే ఉన్న సీఎం కేసీఆర్‌కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ ఎన్నికల ఖర్చుల కోసం దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకు నిధులిచ్చే స్థాయికి ఎలా చేరారని నిలదీశారు. ఇతర దేశాల నుంచి నిధులొస్తున్నాయా..? దేశం విచ్ఛిన్నం చేసేందుకు టెర్రరిస్టు సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా..? తక్షణమే సంబంధిత ఏజెన్సీ సంస్థలన్నీ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 8న ప్రధాని రాక..: ఈరోజు బూత్ స్వశక్తీకరణ అభియాన్, ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన, సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సమావేశంలో బండి సంజయ్‌తో పాటు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, కోశాధికారి శాంతికుమార్, హైదరాబాద్ సెంట్రల్, రంగారెడ్డి అర్బల్, రూరల్, మేడ్చల్ అర్బన్, రూరల్, సికింద్రాబాద్-మహంకాళి, మలక్‌పేట భాగ్యనగర్ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్ని నిధులిస్తోంది..? ఏయే కార్యక్రమాలు చేపడుతుందనే అంశంపై మోదీ వివరణ ఇవ్వబోతున్నారని సంజయ్ నేతలకు తెలిపారు. కేంద్రం అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదనే అంశాన్ని వివరించబోతున్నారని వివరించారు. ఈ నెల 6న జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలతో పాటు 11న జ్యోతిరావు పూలే జయంతి, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
బండి సంజయ్ ట్వీట్: ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌పై బండి సంజయ్ ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్విటర్ టిల్లుతో వేదికను పంచుకున్నారని పేర్కొన్నారు. గవర్నర్‌ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీని ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టారని దుయ్యబట్టారు. మహిళా సర్పంచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన మొదటి ఆరోగ్య మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వేదిక పంచుకున్నారని గుర్తు చేశారు. ముగ్గురి ఆత్మహత్యలకు కారణమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడిని ఆత్మీయ సమ్మేళనంలో ఘనంగా సన్మానించారని విమర్శించారు. బీజేపీ మహిళా నేతలపై సోషల్ మీడియాలో దుర్భాషలాడిన బీఆర్ఎస్ అనుచరులను అరెస్ట్ చేయరన్నారు. నాయకుల మాదిరిగానే అనుచరులు తయారయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బలత్కారిస్, రేపిస్ట్‌లు, లైంగిక వేధింపుదారులు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: