రాష్ట్రవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు (International Yoga day) ఘనంగా సాగుతున్నాయి. భాజపా ఆధ్వర్యంలో పలు చోట్ల యోగా వేడుకలు జరిపారు. హైదరాబాద్ బర్కత్‌పురాలోని భాజపా కార్యాలయంలో జరిగిన యోగా కార్యక్రమంలో... రాష్ట్ర భాజపా వ్యవహరాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్ పాల్గొన్నారు. భాజపా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చింతల రామచంద్రారెడ్డి, భాజపా సిటీ అధ్యక్షుడు గౌతమ్ రావు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి ఆయన ఆసనాలు వేశారు.
సాధన ఠాకూర్ రాసిన యోగా ఫర్ కిడ్స్ పుస్తకంను తరుణ్‌చుగ్ ఆవిష్కరించారు. లక్షల ఏళ్లుగా యోగా భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నా కూడా ఎవరూ ఆచరించలేదని ఆయన అన్నారు. మన జీవన విధానంలో భాగమైన యోగాను ఆచరించకుండా నిర్లక్ష్యం చేశారని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాకు ప్రాచుర్యం తీసుకొచ్చారని... ఈ క్రమంలో ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవాలు జరుపుకునే స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు.
నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar), ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్(K.Laxman), పార్టీ ప్రచారతార విజయశాంతి(Vijaya Shanthi) హాజరయ్యారు. కార్యకర్తలతో కలిసి ఆసనాలు వేసిన నేతలు... యోగా(International Yoga day) విశిష్ఠతను గురించి వివరించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉత్సాహభరితంగా జరిగింది. కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం యోగ సాధన ఎంతగానో దోహదపడుతుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలతోపాటు భాజపా కార్యాలయంలో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవడానికి యోగా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
యోగా భారతీయ జీవన సంస్కృతిలో భాగమని, ప్రాచీన కాలం నుంచి రుషులు, మునులు పాటించేవారిని లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో యోగా సాధన చాలా అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగా సాధన ఒక భాగంగా కొనసాగించాలని ఆయన సూచించారు. యాంత్రిక జీవనం నుంచి ఉపశమనం పొందడానికి యోగా సాధన ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'కరోనా విపత్తు వేళ ఆశా కిరణం.. యోగా'