మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. నర్సింహారెడ్డి మృతి తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. నాయిని గొప్ప కార్మిక నాయకుడని కొనియాడారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే క్రమంలో సుమారు 16 నెలలు తనతో పాటు చంచల్‌గూడ జైలులో ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
నర్సింహారెడ్డి గర్వం లేని నేతని, మచ్చలేని రాజకీయ నాయకుడని, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అంకితభావంతో పని చేసే గొప్ప కార్మిక నాయకుడని అన్నారు. ఆయన మృతి కార్మిక లోకానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక మంచి రాజకీయ నాయకుడినే కాక.. ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయిని మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని.. ఈ కష్ట కాలంలో వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి.. నాయిని మరణం.. రాష్ట్ర రాజకీయాలకు పెద్దలోటు: కోదండరాం