Bandi Sanjay on KCR: ప్రజల దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరగరాయాలని వ్యాఖ్యలు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెరాస ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రావొద్దనే లక్ష్యంతోనే కేసీఆర్ ప్రజలను దారి మళ్లించేందుకు జరుగుతున్న కుట్ర ఇదని విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సమావేశమయ్యారు.
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కేసీఆర్‌కు ఎందుకు నచ్చలేదు. కారణాలు చెప్తే.. ప్రజలకు మేలు చేసేవే అయితే మేము కూడా సహకరిస్తాం కదా. కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే తన కుటుంబమే రాజ్యమేలుతుందని కేసీఆర్ నమ్మకం. భారత రాజ్యాంగంపై నమ్మకం లేనప్పుడు సీఎం పీఠంపై కూర్చునే అర్హత కేసీఆర్‌కు లేదు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న కేసీఆర్పై చట్ట, న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయవాదులు పోరాడాలి.
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెరమరుగు చేయడం అందులో భాగమేనని దుయ్యబట్టారు. ఏ రాజ్యాంగం మీద ఒట్టు వేసి సీఎంగా ప్రమాణం చేశారో... అదే రాజ్యాంగం ద్వారా మరో వ్యక్తి సీఎం కాకూడదని కేసీఆర్ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే రాజ్యాంగాన్ని తిరగరాయాలంటున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, లీగల్ సెల్ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు రవిచంద్ర, ఆంటోనీ రెడ్డి, రామారావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇదీ చూడండి: కాసేపట్లో యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్