Balka Suman comments on BJP leaders: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. భాజపా అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం కక్షకట్టిందని ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంతో కలిసి.. మీడియా సమావేశంలో ధాన్యం సేకరణపై భాజపా వైఖరిని బాల్క సుమన్ ఎండగట్టారు.
ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే భాజపా నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దెబ్బతీశారని విమర్శించారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై పోరాటాన్ని ఉద్ధతం చేస్తామని హెచ్చరించారు. భాజపా నేతలు ధాన్యం సేకరణ అంశంపై ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
"ఆహార భద్రతను కేంద్రం కనీస బాధ్యతగా భావించాలి. రైతులను ఇబ్బంది పెట్టడమే భాజపా ఏకైక లక్ష్యమా?. ఆకలి సూచీలో భారత్ 101వ ర్యాంకులో ఉంది. బంగ్లాదేశ్, నేపాల్ మనకంటే మెరుగ్గా ఉన్నాయి. భాజపా నేతలు వ్యక్తిగత రాజకీయాలు మానుకుని రైతుల సంక్షేమం గురించి ఆలోచించాలి. రైతుల ఉసురు పోసుకున్న నేతలంతా అడ్రస్ లేకుండా పోయారు." -బాల్క సుమన్, ప్రభుత్వ విప్
కేంద్రంతో ధాన్యం కొనిపిస్తామని రైతులను రెచ్చగొట్టిన రాష్ట్ర భాజపా నేతలు... ఇప్పుడు ఎక్కడికి పోయారని బాల్క సుమన్ ప్రశ్నించారు. భాజపా నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం అన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా సీఎం కేసీఆర్‌ను ఏమీచేయలేరని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ధాన్యం కొనుగోలుపై.. ప్రధానికి నేటి నుంచి తీర్మానాల ప్రతులు'