మహానగరంలో గణనాథులు వాడ వాడలా కొలువు దీరారు. విభిన్న ఆకృతుల్లో భక్తులను కనువిందు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన 21 అడుగుల వినూత్న విగ్రహాన్ని బాలాపూర్లో ఈసారి ఏర్పాటు చేశారు. అచ్చం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మాదిరి మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠించారు. స్వామి వారు కళ్ళు మూస్తూ తెరుస్తూ.. చెవులు ఆడిస్తుండటం చూసి చిన్నపిల్లలు కేరింతలు కొడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి బాలాపూర్ గణనాథుణ్ని దర్శించుకుంటున్నారు.
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని.. వర్షాలు కురవాలని దేవుణ్ని ప్రార్థించినట్లు మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీ సంవత్సరం ఇక్కడ రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. బాలాపూర్ తన నియోజకవర్గంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
21 కేజీల భారీ తాపేశ్వరం లడ్డూ...
గణనాథుడికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన 21 కేజీల భారీ తాపేశ్వరం లడ్డూని స్వామివారి చేతిలో అలంకరించారు. ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ లడ్డూ గత సంవత్సర వేలం పాటలో 16.60 లక్షల రూపాయలు పలికింది.
ఇదీ చూడండి : బడికి పోవాలంటే 'వేలాడే ఫీట్' చేయాల్సిందే