ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించినట్లు సినీనటుడు బాలకృష్ణ తెలిపారు. ఆస్పత్రి ప్రారంభించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఆస్పత్రి అందిస్తున్న సేవలను కొనియాడారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని బాలకృష్ణ అన్నారు. అత్యాధునికి పరికరాలు, అధునాతన సౌకర్యాలతో ప్రజలకు వైద్య అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనేక కారణాలతో ప్రజలు క్యాన్సర్ బారినపడుతున్నారని తెలిపారు. ఎందరో పేద కుటుంబాలకు క్యాన్సర్ మానసిక క్షోభ కలిగిస్తోందన్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు కూడా చికిత్సలు అందించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు, ప్రభుత్వం, వైద్య సిబ్బంది సహకారంతో ఆస్పత్రి వైద్య సేవలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఆనాడు కేవలం వంద పడకలతో ఆస్పత్రి ప్రారంభించి నేడు 500కు పైగా పడకలకు చేరిందని ఆయన తెలిపారు. వైద్యం విషయంలో జరుగుతున్న ఎన్నో మార్పులు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. వైద్య సేవలు మెరుగయ్యేందుకు ఎంతో మంది కృషి చేస్తున్నారన్నారు. ఆస్పత్రి ఈ స్థాయికి ఎదిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి బాలకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. బసవతారకం ఆస్పత్రిలో సేవలందిస్తున్న వైద్యసిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి:
ప్రభుత్వం, వైద్యులు సూచించినా నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మహమ్మారిని అధిగమించేందుకు అందరు కృషి చేయాలన్నారు. కొవిడ్ నిబంధలు పాటిస్తూ మన కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించాల్సి వస్తోంది. ఈ కష్టకాలంలో స్వీయ నియంత్రణతోనే వైరస్‌ను అరికట్టేందుకు కృషి చేయాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
మొదట కేవలం వంద పడకలతో ఆస్పత్రి నిర్మించాం. కానీ నేడు 500 పడకల స్థాయికి తీసుకొచ్చాం. అనేకమంది పేద రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అత్యాధునికి పరికరాలతో వైద్యమందిస్తున్నాం. నాన్నాగారి ఆశయాలు నేరవేర్చేలా ముందుకెళ్తున్నాం. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక క్యాన్సర్ ఆస్పత్రి మన బసవతారకం. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశాం. నిష్ణాతులైన వైద్య సిబ్బంది ఇక్కడ సేవలందిస్తున్నారు. వైద్యుల సలహాలు పాటిస్తూ అందరం కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ చికిత్సలు కూడా అందించాం. మన ఆస్పత్రి సేవలకు గానూ పలు అవార్డులు కూడా వచ్చాయి. చాలామంది దాతలు ఆస్పత్రికి సహకారం అందించారు. ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. మారుమూల గ్రామాల్లోనూ అవగాహన తీసుకొస్తున్నాం. - బాలకృష్ణ, సినీనటుడు
ఇదీ చూడండి: Balayya: శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమం