ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన 31 మంది ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు 14వ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నిన్న ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌తోపాటు విద్యార్థి సంఘ నాయకులు పోలీసుల కళ్లు గప్పేందుకు పీపీఈ కిట్ల ధరించి ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ప్రవేశ పరీక్షలు, ఇతర పరీక్షలు కరోనా తగ్గే వరకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు.
ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన 31 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకి రిమాండ్‌కు తరలించారు. ఇవాళ పీసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ దామోదర్ రెడ్డి విద్యార్థుల పక్షాన మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ వేశారు. ప్రతి విద్యార్థి నాయకుడు రెండు వేల రూపాయలు పూచీకత్తుతో.. విడుదల అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లీగల్ సెల్ ఛైర్మన్ దామోదర్‌రెడ్డి విద్యార్థి నాయకుల బెయిల్ మంజూరు కోసం కృషి చేయడంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : చైనా ఆన్‌లైన్ గేమింగ్ ముఠా అరెస్టు