ఐఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్(గేట్) రాసేందుకు విద్యార్హతల్లో పలు మార్పులు చేశారు. గేట్-2021కి ఈ సారి బీఏ విద్యార్థులూ హాజరుకావొచ్చు. అందులో ర్యాంకు సాధించి ఐఐటీల్లో ఎంఏ కోర్సులు అభ్యసించవచ్చు. పీఎస్‌యూలు నిర్వహించే ఉద్యోగ ముఖాముఖీలను సైతం ఎదుర్కోవచ్చు. ఈ దఫా గేట్-2021 నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ బొంబాయి కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలు మార్పులు చేసింది.
ఇప్పటివరకు బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న వారే పరీక్ష రాయాల్సి వచ్చేది. దాన్ని సడలించి మూడో ఏడాది విద్యార్థులకు రాసే అవకాశం కల్పించారు.
ముఖ్యమైన మరికొన్ని మార్పులివీ..
* ఇప్పటివరకు 25 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించేవారు. ఈ సారి కొత్తగా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైస్సెస్ పేపర్లను ప్రవేశపెడుతున్నారు. అంటే బీఎస్సీతోపాటు బీఏ విద్యార్థులు కూడా గేట్‌కు పోటీపడొచ్చు.
* గేట్ 2020 వరకు ఒక విద్యార్థి ఒక్క సబ్జెక్టులోనే పరీక్ష రాయాలి. ఇప్పుడు రెండు సబ్జెక్టులూ రాయవచ్చు. ఏ రెండు సబ్జెక్టులు రాయవచ్చనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తారు.
* గతంలో రెండు విడతలుగా నాలుగు రోజులపాటు ఆన్‌లైన్ పరీక్షలు జరిపేవారు. ప్రస్తుతం కరోనా కారణంగా కొలువులు తగ్గుతాయని ఎక్కువ మంది ఉన్నత విద్య వైపు చూస్తారని భావిస్తున్నారు. దానికితోడు బీటెక్ మూడో ఏడాది విద్యార్థులకు కూడా అవకాశం ఇస్తుండటంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని భావించి ఈ సారి ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు.
"ఎవరికి అవకాశం కల్పించినా గేట్ రాసే వారిలో 99 శాతం మంది బీటెక్ విద్యార్థులే ఉంటారు. ఈ దఫా బీటెక్ మూడో ఏడాది విద్యార్థులూ హాజరయ్యేందుకు అవకాశం ఇస్తున్నందున వారికి బాగా ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు చివరి ఏడాది విద్యార్థులు గేట్ రాసిన తర్వాత మంచి పర్సంటైల్ రాకుంటే మళ్లీ ఏడాది వరకు ఎదురుచూడాల్సి వచ్చేది. తాజా మార్పు వల్ల మూడో ఏడాదిలోనే మంచి స్కోర్ సాధిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ స్కోర్‌కు మూడేళ్లపాటు విలువ ఉంటుంది కాబట్టి దాంతో ఐఐటీల్లో చేరొచ్చు. లేకుంటే తమ సత్తా తెలుసుకొని చివరి ఏడాదిలో ఇంకా బాగా సన్నద్ధం కావొచ్చు."
-బండారి సందీప్, డీజీఎం, టైమ్స్ ఇన్‌స్టిట్యూట్
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు