Azharuddin on ind aus match tickets చాలా ఏళ్లకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించే అవకాశం దక్కిందని హెచ్‌సీఏ పేర్కొంది. ప్రతి ఒక్కరు మ్యాచ్‌ను విజయవంతం చేయాలని కోరుతున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పేటీఎం ద్వారా టిక్కెట్లు విక్రయించామని స్పష్టం చేశారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్నారనే వదంతులు ఎలా వచ్చాయో తెలియదని చెప్పారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని వివరించారు. టిక్కెట్ల విక్రయాల్లో హెచ్‌సీఏ నుంచి ఎలాంటి పొరపాట్లు జరగలేదని సమర్థించుకున్నారు.
నిన్నటి ఘటన చాలా బాధాకరమని హెచ్‌సీఏ పేర్కొంది. బాధితులందరికీ హెచ్‌సీఏ తరఫున వైద్యం అందిస్తామని అజారుద్దీన్ తెలిపారు. టిక్కెట్ల విక్రయాల బాధ్యత పేటీఎంకు ఔట్ సోర్సింగ్ ఇచ్చామన్నారు. విక్రయానికి హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
టికెట్ల అమ్మకాలకు సంబంధించి హెచ్సీఏకు సంబంధం లేదు. టికెట్ల అమ్మకాలు పేటీయంకు అప్పగించాం. టికెట్ల అమ్మకాల విషయంలో పేటియం అద్భుతంగా పని చేసింది. టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరిపాం... బ్లాక్‌లో అమ్మలేదు. బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్లు విచారణ తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము స్టేడియంలో ఏర్పాట్ల నిర్వహణలో బిజీగా ఉన్నాం. - అజారుద్దీన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు
హెచ్‌సీఏలో విభేదాలు ఉన్న మాట వాస్తవమని హెచ్‌సీఏ సెక్రటరీ విజయానంద్ తెలిపారు. మ్యాచ్ విజయవంతం కోసం కృషి చేస్తున్నామన్నారు. కొవిడ్ వల్ల స్టేడియాన్ని మెయింటనెన్స్ చేయలేకపోయామని తెలిపారు. కుర్చీలపై కవర్లు వేస్తాం.. సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పారు. టికెట్ల గందరగోళంపై హెచ్‌సీఏ కమిటీ వేస్తుందన్నారు.