బ్రిటిష్ వారి దాస్యశృంఖలాల నుంచి భారతావని విముక్తి పొందిన రోజుకు 75 వసంతాలు సమీపిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 ఆగష్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ చారిత్రక సందర్భంగా ఆసేతు హిమాచలం వేడుకలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోనూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 75 వారాల పాటు జరిపే వేడుకల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల కోసం 25 కోట్ల రూపాయలను కేటాయించారు. 75 వారాల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా దేశభక్తిని పెంపొందించేలా వివిధ స్థాయిల్లో ఫ్రీడం రన్, కవి సమ్మేళనాలు, వ్యాస రచన, ఉపన్యాసం, చిత్రలేఖన పోటీలతో పాటు ఇతర సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఘనంగా ప్రారంభ వేడుకలు
హైదరాబాద్ సంజీవయ్య పార్కు తరహాలో 75 ముఖ్యమైన ప్రాంతాల్లో జాతీయ పతాకాలను ఘనంగా ఎగరవేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించాలన్న సీఎం... స్వాతంత్ర సమరయోధులు, అమరవీరులకు స్మరించుకొని జోహార్లు అర్పించాలని తెలిపారు. మహోత్సవ ప్రారంభ వేడుకలు ఇవాళ హైదరాబాద్, వరంగల్‌లో జరగనున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, వరంగల్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథులుగా పాల్గొంటారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు.
కాంతులీనుతున్న ప్రధాన కూడళ్లు
ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ప్రత్యేక సందేశాలు ఇస్తారు. ఉత్సవాల ప్రారంభ సూచకంగా బెలూన్లు వదలడం సహా ఇతర కార్యక్రమాలు చేపడతారు. ప్రారంభ వేడుకల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాజ్‌భవన్, బీఆర్కే భవన్, శాసనసభ, హైకోర్టు, చార్మినార్, గన్‌పార్క్ తదితర ప్రాంతాలు కాంతులీనుతున్నాయి.
ఇదీ చదవండి: 'ఆజాదీ కా అమృత్' వేడుకలకు ముస్తాబైన భాగ్యనగరం