స్వాతంత్య్రోద్యమ సమయంలో జాతీయ కాంగ్రెస్ సదస్సులది ప్రత్యేక ఆకర్షణ. గాంధీజీలాంటి మహామహులు హాజరై ప్రసంగించే... కీలక తీర్మానాలు చేసే ఆ కీలక వార్షిక సదస్సు నిర్వహణ అవకాశం... 1921లో బెజవాడకు లభించింది. కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావులాంటి వారి సంకల్పంతో ఇది సాధ్యమైంది. గాంధీజీతో పాటు మోతీలాల్ నెహ్రూ, లాలా లజపతిరాయ్, అబుల్ కలాం ఆజాద్, కస్తూరిబాయి, సరోజినీ నాయుడు, వల్లభ్‌భాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ, రాజగోపాలచారి, జమ్నాలాల్ బజాజ్ ఇలా దేశంలోని ఉద్దండులంతా బెజవాడలో దిగారు. కానీ నాయకులందరినీ ఒకే చోట ఉంచటానికి బెజవాడలో సౌకర్యం లేదు. దీంతో... జాతీయ నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కో స్థానిక ప్రముఖుని ఇంట్లో బస కల్పించారు. గాంధీజీ, కస్తూరిబాయి, వల్లభ్‌భాయ్ పటేల్, మహదేవ దేశాయ్‌లకు మేం ఆతిథ్యమిస్తామంటే మేమిస్తామంటూ... వర్తకుల్లో పోటీ నెలకొంది. చివరకు స్వరాజ్య నిధికి ఎక్కువ చందా ఇచ్చిన గోళ్ల నారాయణరావుకు గాంధీజీ, ఆయన బృందానికి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం దక్కింది.
మామూలుగా... ఎక్కడ జరిగినా అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యేవారు. కానీ బెజవాడ ఆ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. రెండ్రోజుల పాటు గాంధీజీ బెజవాడలో ఉంటారనే సంగతి తెలియటంతో ఆంధ్రదేశం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. రైళ్లు పట్టనంత మంది చేరుకున్నారు. చాలామంది కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి భజనలు చేసుకుంటూ, ఆగిన పల్లెల్లో సభలు పెట్టి స్వరాజ్య ఉద్యమ ప్రసంగాలు చేస్తూ... కాలి నడకన బెజవాడ చేరుకున్నారు. వారందరికీ బెజవాడవాసులే భోజన సదుపాయాలు చూసుకున్నారు. వచ్చిన వారు కూడా వసతుల గురించి పట్టించుకోకుండా... గాంధీజీ దర్శనంతో తీర్థయాత్రాఫలం దక్కుతుందని భావించారు. జనం బారులు తీరి కాంగ్రెస్ నాయకులకు స్వాగతం పలికారు. బెజవాడ వీధులన్నీ పులకరించిపోయాయి. ఇంటింటా అదో పండగ.
తప్పించుకున్న మహాత్ముడు
మార్చి 31, ఏప్రిల్1న కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగానే పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని గాంధీజీకి చూపించారు. రాట్నం కూడా చేర్చాలని సూచించగా... మూడు గంటల స్వల్ప వ్యవధిలోనే మళ్లీ కొత్త నమూనాను పింగళి వేసి చూపించారు. కానీ సమయాభావం వల్ల ఆ సమావేశంలో దానిపై తీర్మానం చేయలేదు. ప్రస్తుత గాంధీనగరం పూర్ణానందంపేట అప్పట్లో ఖాళీ స్థలం. అక్కడే మార్చి 31న సాయంత్రం బహిరంగ సభ. బెజవాడ జనాభా 45 వేలైతే... దాదాపు 2 లక్షల మంది హాజరవటంతో జనంతో నేల ఈనిందా అన్నట్లు తయారైంది. అప్పటికింకా బెజవాడకు విద్యుత్ సదుపాయం లేదు. చీకటైతే పెట్రోమాక్స్ దీపాలే శరణ్యం. మైకులూ లేవు. బిగ్గరగా మాట్లాడాల్సిందే. లక్షల మంది కోలాహలంలో ఎంత బిగ్గరగా మాట్లాడితే వినిపిస్తుంది?
మామూలుగా ఎక్కడైనా గాంధీజీ తన చూపుడు వేలు పైకెత్తితేచాలు సభలో నిశ్శబ్దం అలుముకుంటుంది. కానీ ఆ నాటి సభలో గాంధీ సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ‘‘ఆ సాయంత్రం భారీసభ. అది కాంగ్రెస్ మహాసభలను తలపించింది. మీరు నన్ను చూడటానికి కాదు స్వరాజ్యం గురించి వినటానికి ఇక్కడికి వచ్చారు అని మాత్రమే గాంధీజీ అనగలిగారు. ఆయన కుర్చీపై ఎక్కారు. దీంతో జనాలు తోసుకొని ముందుకు రావటం మొదలైంది. ప్రజలను అదుపుచేయటం నిర్వాహకులకు కూడా చేతగాలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న బాపూజీ... ఏ వైపున జనం తక్కువ ఉన్నారో గమనించి... అటువైపు దూకారు. జనాల్లో కలసిపోయి వారిని తోసుకుంటూ, బాణంలా గుంపులను చీల్చుకుంటూ బయటకు వెళ్లిపోయారు. గాంధీజీ సభలో లేరనే సంగతి గమనించిన ప్రజలు కొంతసేపటికి ఎవరిదారిన వారు వెళ్లారు. విడిది ఇంటికి వెళ్లేసరికి గాంధీజీ ప్రశాంతంగా ఉత్తరాలు రాసుకుంటూ కనిపించారు. మైదానం దాటాక ఎవరిదో కారు కనిపిస్తే ఎక్కి వచ్చేశాను అన్నారాయన’ అని గాంధీ అనుచరుడు, సబర్మతి ఆశ్రమవాసి కాకా కాలేకర్ ఆనాటి సంఘటనను వర్ణించారు. మరుసటి రోజు ఉదయం, సాయంత్రం సభల్లో ప్రజల్ని నియంత్రించే బాధ్యతను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బృందానికి అప్పగించారు. ఆయన సారథ్యంలోని రామదండు వాలంటీర్లు దడులు కట్టి అందరినీ క్రమశిక్షణతో కూర్చోబెట్టారు. సభలు విజయవంతంగా ముగిశాయి.
- కాటా చంద్రహాస్
ఇదీ చదవండి: