మాదక ద్రవ్యాల నిరోధానికి పోలీసుశాఖ నడుం బిగించింది. యువతలో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతోంది. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ఫలితాలపై కళాశాలలు, పాఠశాలల్లో ప్రచారం కల్పిస్తోంది (Awareness walk on drugs at OU). ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి పోలీసులు అవగాహన నడక నిర్వహించారు. కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ (anjani kumar) ప్రారంభించారు. మాదకద్రవ్యాలు తీసుకోవడం వలన కలిగే నష్టాలను ఆయన విద్యార్థులకు వివరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల తీవ్రత అంతగా లేదని... అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, సుభాశ్ రెడ్డితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ పాల్గొన్నారు.
నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా "గంజాయి తాగొద్దు, డ్రగ్స్ వాడొడ్డు" అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం అభినందనీయం. తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.. మేము ఏ విషయంలోనైనా మీకు సాయం చేస్తాము. -అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ.
రాష్ట్రాన్ని డ్రగ్స్‌రహిత తెలంగాణగా చేయాలని సీఎం కేసీఆర్ ఉద్దేశం. డ్రగ్స్ వాడడం వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి అందరికీ అవగాహన కల్పించాలి. సామాజికి బాధ్యత ఉన్న అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కోరుతున్నాను. -కాలేరు వెంకటేశ్, అంబర్పేట్ ఎమ్మెల్యే.
ఇదీ చూడండి: Global Hospital: ఎముకల ఆరోగ్యంపై అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి అవగాహన కార్యక్రమం