పాముకాటు బాధితులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు కల్పించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. సరైన సమయానికి చికిత్స, యాంటీ-విషం ఇంజక్షన్లు అందుబాటులో ఉంచడం, పీహెచ్‌సీలలో శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా పాముకాటు బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కౌన్సిల్ న్యూ దిల్లీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో నిర్వహించిన జాతీయ స్నేక్ బైట్ అవగాహన సదస్సులో గవర్నర్ రాజ్‌భవన్ నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మన దేశంలో పాముకాటు మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. అవగాహన, చికిత్సలతో ఈ మరణాలను నివారించవచ్చన్నారు. పాముకాటు కారణంగా మూత్రపిండ వైఫల్యం ఉన్న వారికి తక్షణ చికిత్స అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుబంధంగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారు. పాముకాటు నివారణ, చికిత్సపై అవగాహన కల్పించడంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కౌన్సిల్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు.
ఇదీ చూడండి: Tollywood Drugs case: పూరి జగన్నాథ్, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు