Automation System for Substations Management : విద్యుత్ సరఫరా ప్రక్రియలో టీఎస్ ట్రాన్స్‌కో నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ దిశగా ఆటోమేషన్ పరిజ్ఞానంతో సబ్ స్టేషన్ల ఆపరేషన్ ప్రక్రియను నిర్వహించాలని భావించిన ఉన్నతాధికారుల ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. నూతన సాంకేతికతో అభివృద్ధి చేసిన ఆటోమేషన్ సబ్‌స్టేషన్ విధానాన్ని తొలుత రాష్ట్రంలోని కొన్ని సబ్ స్టేషన్లలో ప్రయోగించారు. అది విజయవంతం కావడంతో మరికొన్ని చోట్ల అమలు చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. అందుకుగానూ రాబోయే రోజుల్లో దాదాపు 50 శాతం సబ్‌స్టేషన్‌లలో ఆటోమేషన్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
Automation System in telangana : సుదూర ప్రాంతాల్లోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంట్.. ట్రాన్స్ కో ఆధ్వర్యంలో తొలుత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 400, 220 కేవీ సబ్ స్టేషన్లకు సరఫరా అవుతుంది. సబ్ స్టేషన్లలో ఆ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సిబ్బంది ఉంటారు. కానీ.. ఆటోమేషన్ సాంకేతికతతో అక్కడున్న సిబ్బందితో కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి ఆన్‌లైన్ ద్వారా ఆటోమేషన్ టెక్నాలజీతో నిర్వహించేందుకు ట్రాన్స్ కో సన్నద్దమైంది. దీనివల్ల కరెంట్ సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తగ్గడంతో పాటు మానవ, ఆర్థిక వనరులు ఆదా కానున్నాయి. ఈ ఆటోమేషన్ సబ్‌స్టేషన్ విధానం మరింత సులువుగా అర్థమయ్యేలా చేసిన ప్రయత్నం ఇది.
Substations Management in Telangana : ఆర్థిక భారం పెరగకుండా సబ్ స్టేషన్ల నిర్వహణలో సంస్కరణలు తేవాలని ట్రాన్స్ కో సంకల్పించింది. దీనికి గానూ రెండు సబ్‌స్టేషన్ల విద్యుత్ సరఫరా వివరాలను ఒకే సబ్‌స్టేషన్‌లో తెలుసుకోవచ్చు. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బందిని తగ్గించడంతో పాటు వారి విధులను మరో సబ్‌స్టేషన్‌లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు సిద్దిపేటలో 132, 220 కేవీ సబ్ స్టేషన్లు ఒకే ఆవరణలో ఉండేవి. వీటి కంట్రోల్ రూమ్‌లు విడివిడిగా ఉన్నందున అక్కడ 10 మందికి పైగా సిబ్బంది పని చేసేవారు. 2 సబ్ స్టేషన్లకు కలిపి ఒక కంట్రోల్ రూం చాలని భావించిన యాజమాన్యం.. అక్కడున్న వారిలో ముగ్గురు ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో అక్కడ కొద్ది మంది సిబ్బందితో 2 సబ్‌స్టేషన్ల వివరాలను పరిశీలించవచ్చు. సిరిసిల్ల, వికారాబాద్ జిల్లా పరిగి, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఇమ్లీబన్, ఎర్రగడ్డల్లో రెండేసి సబ్ స్టేషన్ల కంట్రోల్ రూంలను ఒకటిగా మార్చారు.
సిబ్బంది ఆదా..: ఆటోమేషన్ సబ్‌స్టేషన్ సాంకేతికతో హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రి వద్ద ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్ కంట్రోల్ రూమ్‌ను తొలగించి అక్కడున్న ముగ్గురు సిబ్బందిని బదిలీ చేశారు. దాన్ని ఆటోమేషన్ ప్రక్రియతో ఉస్మానియా యూనివర్సిటీ సబ్ స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట 220 కేవీ సబ్ స్టేషన్‌ను నల్గొండ జిల్లా డిండి 400 కేవీ సబ్ స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మరికొన్ని సబ్ స్టేషన్లను ఈ విధానంలోకి తేవడానికి ట్రాన్స్ కో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు హైదరాబాద్ వచ్చి కొన్ని సబ్ స్టేషన్లలోని ఆటోమేషన్ విధానాన్ని పరిశీలించారు.
సీఎం శ్రద్ధతోనే ఇదంతా..: తెలంగాణలో కరెంట్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను ఎలా అభివృద్ది చేశారో పరిశీలించడానికి ఈ అధికారుల బృందం వచ్చింది. హైదరాబాద్‌లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి నగరం చుట్టూ ఏర్పాటు చేసిన 400 కేవీ సబ్ స్టేషన్ల విద్యుత్ వలయాన్ని చూసి కర్ణాటక, కేరళ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెంగళూరు, తిరువనంతపురం నగరాలకు ఇలాంటి పవర్ రింగ్ పూర్తిగా నిర్మించలేకపోయినట్లు వారు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంపై శ్రద్దతో నిరంతర సరఫరాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం వల్ల పవర్ రింగ్ నిర్మాణం వేగంగా పూర్తి చేసినట్లు ట్రాన్స్ కో అధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి..
2030 కల్లా పది లక్షల ఉద్యోగాలు!- ఆ ఒక్క రంగంలోనే..
Artisans strike: ముగిసిన ఆర్టిజన్ల సమ్మె.. తొలగించిన 200మందికి త్వరలోనే పోస్టింగ్