Gas Leakage In Bachupally Aurobindo Pharma : బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అరబిందో ఫార్మా కంపెనీలో రియాక్టర్ల వద్ద గ్యాస్ లీకేజీ ఏర్పడి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు ఆ కంపెనీలో పని చేసే శ్రామికులు తెలుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బాధితులను ఘటనాస్థలం నుంచి హుటాహుటిన బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని బయటకు వెళ్లకుండా అరబిందో యాజమాన్యం చూసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు ప్రేమ్ కుమార్, గౌరీనాథ్, ప్రసాద్ రాజు, విమల, గౌరీ, యాసిస్ ఆలీ, శ్రీనివాస్రావులుగా గుర్తించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరిని 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచామని.. మిగిలిన వాళ్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి. ఆసుపత్రి లోపలికి అరబిందో ఫార్మా యాజమాన్యం ఎవ్వరిని అనుమతించలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఫార్మా కంపెనీకి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తును ప్రారంభించారు. ఎందువల్ల ఈ గ్యాస్ లీకైంది అనే విషయంపై.. ఇంకా స్పష్టత రాలేదు. అలాగని అరబిందో సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎవరినీ అనుమతించడం లేదు. దీనిపై అందరిలో సందిగ్ధత నెలకొంది.
Fire Accident In Bansuwada Govt Hospital : మరో ఘటనలో బాన్సువాడలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు ఆసుపత్రి గదులను శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా ఆపరేషన్ థియేటర్లోని ఏసీ నుంచి ఒక్కసారిగా చెలరేగాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఫైరింజన్ మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదం జరగడంతో పై అంతస్తుల్లో ఉన్న రోగులను కిందకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంతోనే ఈ ఘటన జరిగినట్లు అగ్ని మాపక సిబ్బంది గుర్తించారు.
Fire Accident in LB Nagar : ఎల్బీనగర్లో అర్ధరాత్రి మరో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో స్థానికంగా ఉండే కూడలి సమీపంలోని ఓ పెయింట్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంబంధించినది. అనంతరం పక్కనే ఉన్న పాన్ షాప్‌లోకి మంటలు వ్యాపించి ఆ షాపు పూర్తిగా దగ్ధమైంది. పెయింట్ దుకాణంలో పెయింట్ డబ్బాలు ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడి చుట్టుపక్క ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆ వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. వీరివురూ కలిపి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇవీ చదవండి :