Telangana Congress: ఏఐసీసీ పిలుపుతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆగస్టు 5న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు తలపెట్టినట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, అగ్నిపథ్ తదితర అంశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు వివరించారు. నిత్యావసర ధరలపై జీఎస్టీ పెంపు తదితర అంశాలను నిరసిస్తూ గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు కాంగ్రెస్ పోరాటాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ వరదలతో తీవ్రంగా నష్టం జరిగిందని.. 20లక్షల ఎకరాలల్లో వివిధ రకాల పంటలు నాశనమయ్యాయని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇందువల్ల దాదాపు రెండువేల కోట్లు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఎలాంటి చలనంలేదని.. వరద బాధితులను ఆదుకోవడంలో రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనట్లు ఆరోపించారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని.. వరదల్లో మృత్యువాత పడ్డ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్ట్ 5న నియోజకవర్గ, జిల్లాస్థాయిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ ధర్నాల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర రాజధానిలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాట కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారని మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు.
ఇవీ చదవండి: ఆర్జీయూకేటీలో కొనసాగుతోన్న విద్యార్థుల ఆందోళన.. ఎంపీ అడ్డగింత