న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సీజేకు ఏపీ సీఎం జగన్ లేఖ రాయడం, ప్రభుత్వ సలహాదారు ఆ లేఖను మీడియాకు విడుదల చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. కానీ... జగన్ నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాసినందున.. సీజేఐ వద్ద ఉన్న ఈ అంశంలో తాను కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ కు సమ్మతి ఇవ్వలేనంటూ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాంపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించడానికి సమ్మతి కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖకు ఏజీ వేణుగోపాల్ బదులిచ్చారు.
ఏపీ సీఎం జగన్ లేఖ రాయడం, దాన్ని బహిర్గతం చేసిన సమయం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోందన్న అటార్నీ జనరల్.. లేఖలో అభ్యంతరకర ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రాథమికంగా సీఎం, అతని సలహాదారు చేసిన చర్య సరైనది కాదని చెప్పారు. అయితే... ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవగాహనలో ఉందని.. సీజేఐ వద్ద ఈ అంశం ఉన్నందున కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు సమ్మతించలేమని చెప్పారు.
ఇదీ చూడండి: 'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'