ఏపీ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో నెలకొన్న పీఠాధిపత్యం వివాదాన్ని పరిష్కరించడానికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వయంగా రంగంలోకి దిగారు. దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి గతనెల 8న శివైక్యం పొందిన తర్వాత ఆయన మొదటి భార్య, రెండోభార్య కుమారులు పీఠం కోసం పట్టుపట్టారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి పొందిన ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి.. దివంగత పీఠాధిపతి రెండోభార్య మారుతి మహాలక్ష్మమ్మ, ఆమె ఇద్దరు కుమారులతో సమావేశమయ్యారు.
ఆ తర్వాత పెద్ద భార్య కుమారులు, కుమార్తెలతో దాదాపు 2 గంటల చర్చలు జరిపారు. నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మఠం పవిత్రత కాపాడేందుకు కుటుంబ సభ్యులంతా ఏకతాటిపైకి రావాలని సూచించారు. మూడ్రోజుల్లోగా రెండు కుటుంబాలూ కూర్చుని పీఠాధిపతిగా ఎవరికి అర్హత ఉందో మీరే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.
పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి చెందిన రెండు కుటుంబాల వారూ ఎవరికి వారే తమకే పీఠాధిపత్యం కావాలని కోరారు. తనకు వేదాలు తెలుసని, న్యాయవాదిగా పనిచేస్తున్నానని, తనకే అన్ని అర్హతలున్నాయని పెద్దభార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మంత్రికి విజ్ఞాపన అందజేశారు. రెండో కుమారుడు భద్రయ్యస్వామి కూడా తన తల్లికి కిడ్నీ దానం చేశానని తనకే పీఠాధిపత్యం ఇవ్వాలని కోరారు. రెండో భార్య మారుతీ మహాలక్ష్మి తమకు వీలునామా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెండు మూడు రోజుల్లో కుటుంబసభ్యులమంతా ఒకచోట కూర్చుని చర్చించి నిర్ణయం చెప్తామని బ్రహ్మంగారి వారసులు తెలిపారు.
బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యానికి దారితీసిన పరిస్థితులపై.. కొందరు గ్రామస్థులు, బ్రాహ్మణ సంఘాలు మంత్రి వెల్లంపల్లికి లిఖితపూర్వక వివరాలు అందజేశారు. మరోవైపు.. ఈ విషయంపై స్పందించిన మంత్రి.. ఇరు కటుంబాల వారూ మూడ్రోజుల్లో ఏకతాటిపైకి రాకపోతే.. ప్రభుత్వమే ఓ కమిటీ వేసి పీఠాధిపతిని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: బ్లాక్ ఫంగస్ ఎలా ప్రవేశిస్తుంది? ఎవరిలో ఎక్కువ ముప్పు?