హైదరాబాద్ హిమాయత్లో ఉన్న సీపీఐ కార్యాలయం లోపలికి ఆదివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దిచక్ర వాహనంపై వచ్చారు. పార్టీ కార్యాలయంలో ఉన్న రెడ్ సురేందర్‌ను ఒక వ్యక్తి తెలుగు అకాడమీ ఎక్కడ అని అడుగుతుండగా... మరో వ్యక్తి పెద్ద కర్రతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌కు చెందిన ఇన్నోవా వాహనంపై దాడికి దిగాడు. ఈ దాడిలో కారు ముందు, ఎడమ వైపు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వెనకవైపు కూడా దాడి చేయడం వల్ల కారు దెబ్బతింది. అగంతకులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెడ్ సురేందర్‌పై కూడా దాడికి యత్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేసిన వెంటనే దుండగులు బైకుపై అక్కడి నుంచి పారిపోయారు.
ఫోన్లో ఫిర్యాదు:
ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌కు తెలియజేయడం వల్ల వారు హుటాహుటిన కార్యాలయాలనికి చేరుకున్నారు. వెంటనే డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు చాడ వెంకట్ ఫోన్ ద్వారా జరిగిన ఘటన వివరాలను తెలియజేశారు.
కఠినంగా శిక్షించాలి..
ఈ ఘటనను ఆషామాషీగా తీసుకొవద్దని... దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, కమిషనర్లను చాడ వెంకట్ కోరారు. మరోవైపు పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి గురించి నారాయణగూడ పోలీసులకు సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నరసింహా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన నారాయణగూడ పోలీసులు మగ్ధుంభవన్కు వచ్చి క్లూస్ టీమ్ ద్వారా తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. కార్యాలయ సిబ్బంది నుంచి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మతోన్మాద శక్తులతో సంబంధం ఉన్న వారే దాడికి పాల్పడ్డారని నారాయణ, చాడ అనుమానం వ్యక్తం చేశారు. విధానపరమైన రాజకీయ వైరుద్యాలు సహజంగా ఉంటాయని... అయితే పార్టీ కార్యాలయాలపై భౌతిక పరమైన దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతోన్మాద శక్తులతో సంబంధాలున్న వారే దాడిలో పాల్గొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ముష్కరులను పోలీసులు అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దాడి... చాడ కారు ధ్వంసం