వాక్ స్వాతంత్య్రాన్ని హరించే హక్కు జగన్‌కు లేదనే విషయం సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో స్పష్టమైందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందనేలా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. సీజేఐ వ్యాఖ్యలతోనైనా ఏపీ సీఎం కళ్లు తెరవాలని హితవు పలికారు. గతంలో బ్రిటీష్ వారు భారతీయలపై రాజద్రోహం కేసు పెట్టేవారని గుర్తు చేశారు. ఈ సెక్షన్ ఇంకా మనుగడలోనే ఉందని జగన్ ద్వారానే మళ్లీ తెలిసిందని ఎద్దేవా చేశారు.
సమస్యలకు నిలయంగా రాష్ట్రం తయారైందని అచ్చెన్న మండిపడ్డారు. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి భోజనం చేసినపుడు నీటి సంగతి జగన్‌కి గుర్తు రాలేదా అని నిలదీశారు. నీటి సమస్యపై అవగాహన, పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వ హయంలో ఏనాడూ నీటి వివాదం తలెత్తలేదన్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే హైదరాబాద్‌లో ఏపీ ఆస్తులను చంద్రబాబు తెలంగాణకు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు తెదేపా కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పోరాటం ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చూడండి: krishna board : 'తెలంగాణ తీరుతో ఏపీకి తీరని నష్టం'