ఓటాన్ అకౌంట్ స్థానంలో పూర్తి స్థాయి పద్దు కోసం ఈ నెల తొమ్మిది నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల విరామం తర్వాత సెప్టెంబర్ 14 నుంచి శాసనసభ వరుసగా సమావేశమవుతోంది. బడ్జెట్‌పై సాధారణ చర్చతో పాటు పద్దులపై చర్చ పూర్తైంది. ఆరు రోజుల పాటు అన్ని పద్దులపైనా చర్చించారు. పద్దులపై చర్చ పూర్తి కావడం వల్ల బడ్జెట్‌కు తుది ఆమోదముద్ర వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ద్రవ్యవినిమయ బిల్లుపై ఆదివారం ఉభయసభల్లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. రెండు సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపైనే నేరుగా చర్చ చేపడతారు.
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత శాసన మండలిలో చర్చ ఉంటుంది. శనివారం నాడు శాసనసభ ఆమోదించిన పురపాలక, సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లులపై మండలిలో ఆదివారం ఉదయం చర్చ ఉంటుంది. కాగ్ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. మార్చి 2018తో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఇచ్చిన నివేదికతో పాటు 2017-18 వార్షిక సంవత్సర లెక్కలను అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఇవీ చూడండి : సెప్టెంబరు 4 నుంచి బీఈడీ తరగతులు ప్రారంభం