Municipalities special council meetings : రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సమాన అభివృద్ధి లక్ష్యంగా కొత్త బడ్జెట్ రూపకల్పన చేయాలని పురపాలకశాఖ నిర్ణయించింది. అభివృద్ధిపై చర్చల కోసం కౌన్సిల్ సమావేశాల కోసం సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్ రూపకల్పన కోసం ప్రత్యేకంగా చర్చించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ లేఖలు రాశారు.
తెలంగాణ మున్సిపల్ చట్టం - 2019లోని సెక్షన్ 107 ప్రకారం స్థానిక సంస్థల ఆదాయ వ్యయాలు, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసుకుని స్వయం వనరుల సమీకరణ ప్రయత్నాలు చేసుకుంటూ.. బలోపేతమయ్యే మార్గాలు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని సూచించారు. క్వాలిటీలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి లక్ష్యంగా కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన ఉండాలని అన్నారు.
అన్ని మున్సిపాలిటీలు ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణ ప్రగతి నిధులు అందుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. శానిటేషన్, వాటర్ ఛార్జీలు, లోన్ పేమెంట్స్, కరెంట్ ఛార్జీలతోపాటు పది శాతం గ్రీన్ బడ్జెట్ నిధులను ఖర్చుగా చూపాలని నిర్దేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ను సమర్థవంతంగా రూపొందించేందుకు జిల్లా కలెక్టర్లు సన్నాహాక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి : Republic Day Celebrations at Telangana Raj Bhavan : ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రాజ్భవన్లో..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!