రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ప్రారంభం కానుంది. జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(ఎన్‌సీడీసీ)ను హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల దిల్లీలో జరిగిన జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) సమావేశాల్లో సాధ్యమైనంత వేగంగా ఎన్‌సీడీసీని నెలకొల్పాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచించారు. ముందుగా నల్లకుంటలోని కుష్టు వ్యాధి నిర్మూలన శిక్షణ కేంద్రం భవనాలను ఇందుకు కేటాయించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది.
కేంద్ర ఉన్నతాధికారుల పర్యటన
అత్యాధునిక ప్రయోగశాలతో కూడిన శాశ్వత భవన నిర్మాణానికి నాచారంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)కు చెందిన 20 ఎకరాల స్థలంలో... ఎన్‌సీడీసీ కోసం మూడెకరాలను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక్కడ సుమారు రూ.25 కోట్లతో అధునాతన ప్రయోగశాలను నెలకొల్పుతారని వైద్యవర్గాలు తెలిపాయి. ఎన్‌సీడీసీ అందుబాటులోకి వస్తే.. కరోనా సహా స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, జికా తదితర ప్రమాదకర వైరస్‌లు, సూక్ష్మక్రిములపై పరిశోధనలు కొనసాగే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నాయి. తాత్కాలిక భవనాలు, శాశ్వత భవన నిర్మాణానికి స్థల పరిశీలనకు వచ్చేవారంలో కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి.
ఏడాది కిందటే ఆమోదం
దేశవ్యాప్తంగా ప్రస్తుతమున్న ఎన్‌సీడీసీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు మరో 27 కొత్త శాఖలను రాష్ట్రాల్లో నెలకొల్పాలనే లక్ష్యంతో 12వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.400 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రాల్లో నెలకొల్పే ప్రతి ఎన్‌సీడీసీ శాఖకూ సొంతంగా భవనాన్ని నిర్మించాలని లక్ష్యం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడెకరాల స్థలాన్ని సమకూర్చాలి. నాలుగేళ్ల కిందటే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపగా.. 2019 డిసెంబరులో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆమోదించింది. కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో మూడంతస్తుల భవనాన్ని ఎన్‌సీడీసీ కోసం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అక్కడ నిర్వహణ సాధ్యం కాదని కేంద్ర బృందం పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో వైరస్‌లపై ప్రయోగాలు, పరిశోధనలు విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎన్‌సీడీసీని రాష్ట్రంలో స్థాపన దిశగా శరవేగంగా కార్యాచరణ సిద్ధమవుతోంది. దీన్ని నెలకొల్పడానికయ్యే వ్యయంతో పాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇతర మానవ వనరుల నియామకాలకయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుంది.
ఇదీ చదవండి: 'హరిత పన్ను'పై అభ్యంతరం.. కేంద్ర ప్రతిపాదనపై అసహనం!