ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చినా.. ఆరోగ్యశ్రీ పథకం కూడా అమలు కానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 77.19 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతుండగా, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఏబీ పరిధిలోకి రాష్ట్రంలోని 26.11 లక్షల కుటుంబాలే రానున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ పరిధిలో లేని సుమారు 400కు పైగా చికిత్సలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేస్తామని వైద్యవర్గాలు తెలిపాయి.
ఆయుష్మాన్ భారత్ రాకతో..
- ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ పేరిట పథకాన్ని అమలు చేస్తారు.
- ఒక్కో కుటుంబానికి గరిష్ఠ పరిమితి రూ.5 లక్షల వరకూ పెరుగుతుంది.
- 1350 రకాల చికిత్సలు పూర్తిగా ఉచితం.
- ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీలో చేర్చని చికిత్సలు, ఆయుష్ వైద్య సేవలు కూడా కొత్తగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
- ఈ పథకం పరిధిలోకి ఇటీవలే కొవిడ్ చికిత్సలను చేర్చారు.
- ఏబీ పరిధిలోకి వచ్చే 26.11 లక్షల కుటుంబాలకు ఏటా సుమారుగా రూ.350-400 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
- ఇందులో 60 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం, 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
- అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారుగా రూ.212-250 కోట్లు వచ్చే అవకాశాలున్నాయి.
- ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా అవుతుండడం వల్ల.. తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో.. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికొచ్చి చికిత్స పొందడానికి మార్గం సులభతరమవుతుంది. ముఖ్యంగా వలస కార్మికులకు ఉపయోగంగా ఉంటుంది.
- ఆరోగ్యశ్రీ చికిత్సల ధరల కంటే ఏబీలో చాలా చికిత్సల ధరలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల దీనిని అమలు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు ఏ మేరకు ముందుకొస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
- అయితే ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను యథాతథంగా అమలు చేస్తూ.. కొత్త చికిత్సలకు మాత్రం ఆయుష్మాన్ భారత్ ధరలను వర్తింపజేయాలని వైద్యశాఖ యోచిస్తోంది.
ఆరోగ్యశ్రీ పరిధిలో..
- ఒక్కో కుటుంబానికి ఏటా గరిష్ఠంగా రూ.2 లక్షలు పరిమితి ఉండగా.. కొన్ని జబ్బులకు రూ.13 లక్షల వరకూ చికిత్స వ్యయాన్ని అందిస్తున్నారు.
- సుమారు 946 చికిత్సలకు ఈ పథకం కింద పూర్తి ఉచితం.
- వీటితో పాటు సుమారు 136 రకాల జబ్బులకు ఏడాది పాటు పరిశీలన (ఫాలోఅప్) చికిత్సలను కూడా అందజేస్తున్నారు. ఉదాహరణకు గుండెజబ్బు, మూత్రపిండాల వైఫల్యం, పక్షవాతం తదితర జబ్బులకు సత్వర చికిత్స అందించడమే కాకుండా ఏడాది పాటు ఉచితంగా వైద్యుని సంప్రదింపులు, నిర్ధారణ పరీక్షలు, ఔషధాలను కూడా అందిస్తున్నారు.
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు తదితర అవయవ మార్పిడి చికిత్సలను కూడా చేర్చింది. ఇందుకోసం గరిష్ఠంగా రూ.13 లక్షల వరకూ చికిత్సల వ్యయ పరిమితిని పెంచింది.
- ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.780 కోట్లను ఖర్చుచేస్తోంది.
ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైనదని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఏటా ఆరోగ్యశ్రీ కింద సుమారు రూ.1000 నుంచి రూ.1200 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పథకానికి రూ.200-300 కోట్ల సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆరోగ్యశ్రీ ద్వారా 80 లక్షల కుటుంబాలకు చికిత్స అందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్‌లో 26 లక్షల కుటుంబాలకు మాత్రమే చికిత్స అందుతుంది. కేంద్ర ఆరోగ్య పథకంలో చికిత్సల ధరలు తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీలోలేని కొన్ని చికిత్సలు ఆయుష్మాన్ భారత్‌లో ఉన్నాయి. వాటిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని సూత్రప్రాయంగా అంగీకరించాం’ అని ఈటల తెలిపారు. వైద్యవిద్య సీట్ల కేటాయింపుల్లో కొందరు విద్యార్థులకు నష్టం జరిగినట్లు ఫిర్యాదులొచ్చాయని, వాటి పరిశీలనకు కమిటీని వేశామన్నారు. ‘వైద్యవిద్య ప్రవేశాల్లో పదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిబంధనలు కొనసాగుతున్నాయి. దీనివల్లనే కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటాం. తెలంగాణ విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తామని’ వెల్లడించారు. కొవిడ్ టీకాలు ఎప్పుడు వేస్తారనే విషయమై స్పష్టత రాలేదనీ, కేంద్రం ఎప్పుడు అనుమతించినా వైద్యఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందన్నారు.