సైబర్ మోసాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఠాణాలో సైబర్‌క్రైమ్‌కు సంబంధించిన ఫిర్యాదులు తీసుకునేలా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. దూరాభారంతో ఆలస్యం.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి అటు షాద్‌నగర్.. ఇటు శామీర్‌పేట్, మేడ్చల్ వరకు విస్తరించి ఉంది. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వ్యయ ప్రయాసలు కోర్చి గచ్చిబౌలి కమిషనరేట్‌లోని సైబర్ క్రైం ఠాణాకు రావాల్సి వస్తుంది. సైబర్‌క్రైం ఠాణాలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో వారిపై తీవ్ర భారం పడుతుంది.
దర్యాప్తునకు వీలుగా ఏర్పాట్లు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్, శంషాబాద్, మాదాపూర్ జోన్లున్నాయి. జోన్‌కొకటి చొప్పున సైబర్‌క్రైం ఠాణాలను ఏర్పాటు చేయాలని సీపీ వీసీ సజ్జనార్ నిర్ణయించారు. తొలుత శంషాబాద్‌లో ప్రారంభించాలని భావించారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి.. ప్రస్తుతమున్న పోలీస్ స్టేషన్ల(శాంతి భద్రత)లోనే కేసుల స్వీకరణ.. దర్యాప్తు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడం ఉత్తమమనే నిర్ధారణకొచ్చారు. ప్రతి కేసుకు విచారణాధికారిగా ఇన్స్‌పెక్టర్(ఎస్‌హెచ్‌వో/డీఐ) ఉంటారు.
తొలిరోజు పలు ఠాణాల్లో కేసులు.. ఇతర కేసులతో పోలిస్తే సైబర్ మోసాల కేసుల దర్యాప్తు ఎక్కువగా సాంకేతిక అంశాలతో ముడి పడి ఉంటాయి. నిందితులంతా ఎక్కడెక్కడో ఉంటారు. వారిని గుర్తించినా ఇక్కడికి తీసుకొచ్చేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇన్‌స్పెక్టర్ సహా ఒక ఎస్‌ఐ, కొందరు కానిస్టేబుళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. సైబర్‌క్రైం ఠాణాలో సీనియర్ ఇన్‌స్పెక్టర్లను ఒక్కో జోన్‌కు ఒక్కొక్కర్ని ఇన్‌ఛార్జిగా నియమించారు. స్థానిక పోలీసులకు దర్యాప్తులో వీరు మార్గనిర్దేశం వహిస్తారు. ఠాణాల వారీగా నమోదైన కేసుల వివరాలను ప్రతిరోజు తెప్పించుకుని దర్యాప్తును పర్యవేక్షించే బాధ్యతను సైబర్‌క్రైమ్స్ ఏసీపీ బాలకృష్ణారెడ్డికి అప్పగించారు. దుండిగల్ సహా మరికొన్ని ఠాణాల్లో తొలి రోజు ఒకటి, రెండు ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రహ్మాన్‌కు గాంధీ పురస్కారంపై బంగ్లాదేశ్ హర్షం