INTER FIRST YEAR ADMISSIONS SCHEDULE : జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ను బోర్డు విడుదల చేసింది. మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 15న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. జూన్ 30 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని.. రెండో విడత ప్రవేశాల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
డౌన్‌లోడ్ చేసుకున్న మార్కుల మెమో ద్వారానే ప్రాథమిక ప్రవేశాలు చేపట్టాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థులు తమ ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో, టీసీ ఇచ్చిన తర్వాత ప్రవేశాలను ధ్రువీకరించనున్నట్లు నవీన్ మిత్తల్ వెల్లడించారు. ఇంటర్ కాలేజీల ప్రవేశాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బోర్డు తెలిపింది. అమ్మాయిలకు మూడొంతుల సీట్లను కేటాయించాలని పేర్కొంది. పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లు ఇచ్చినందున జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎలాంటి ఎంట్రెన్స్ నిర్వహించరాదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
Inter classes start from June 1 : ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒక్కో సెక్షన్‌లో 88 మందికి మించి విద్యార్థులను చేర్చుకోవద్దని.. అనుమతి లేకుండా అదనపు సెక్షన్లు పెడితే జరిమానాతో పాటు కాలేజీ అనుంబంధ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని ప్రవేశాలు జరిగాయో రోజూ బోర్డు పెట్టాలని తెలిపింది.
విద్యార్థులను ప్రేరేపించేలా కాలేజీలు ప్రకటనలు చేయరాదని పేర్కొంది. కళాశాలల్లో బాలికల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని వివరించింది. గుర్తింపు పొందిన కళాశాలల్లోనే చేరాలని విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచించింది. లాంఛనంగా షెడ్యూలు విడుదల చేసినప్పటికీ.. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ కళాశాలలు కొంతకాలంగా అనధికారికంగా ప్రవేశాలు నిర్వహిస్తూనే ఉన్నాయి.
Telangana Inter Results 2023 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే బోర్డు విడుదల చేసింది. మార్చి/ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్.. సెకండియర్‌లో ములుగు జిల్లా టాప్ ప్లేస్ సంపాదించుకున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 62.85 శాతం, రెండో సంవత్సరం ఫలితాల్లో 67.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది.
ఇవీ చదవండి: