తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ నేడు సమావేశం కానున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం భేటీ జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ తీసుకొచ్చిన అనంతరం కేసీఆర్తో సమావేశం కావడం ఇదే తొలిసారి.
ధర్మాధికారి కమిటీ నివేదికపై చర్చ!
ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలు ముఖ్యమంత్రుల భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. విభజన చట్టంలోని అంశాలు సహా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు చర్చించనున్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి ధర్మాధికారి కమిటీ తుది నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దానిపై చర్చించే అవకాశం ఉంది. ఏపీకి చెందిన 650 మంది విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ రిలీవ్ చేసినా వారిని ఏపీ ఇంకా విధుల్లోకి తీసుకోలేదు.
నదీ జలాల తరలింపుపై మథనం
విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. నదీజలాల అంశం కూడా చర్చకు రానుంది. గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించేందుకు గతంలో ఉమ్మడి ప్రాజెక్ట్ను ప్రతిపాదించినా అది ముందుకు సాగలేదు. విడివిడిగా జలాల తరలింపు ఆలోచనతో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా నదుల అనుసంధానంపై కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో జలాల తరలింపు అంశం ముఖ్యమంత్రుల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ఎన్పీఆర్, ఎన్సీఆర్ ప్రస్తావనకు వచ్చే అవకాశం
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వివాదాస్పదం అవుతోన్న నేపథ్యంలో ఆ విషయం కూడా చర్చకు రానుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇతర సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్పీఆర్, ఎన్సీఆర్ సహా ఇతర రాజకీయ అంశాలు, పరిణామాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్