ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్... రాజ్‌భవన్‌కు వెళ్లి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఈనెల ఎనిమిదో తేదీన షెడ్యూల్ విడుదల, అనంతర పరిణామాలను వివరించినట్లు తెలిసింది.
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను చేపట్టేలా ప్రకటన చేసిన ఏపీ ఎన్నికల కమిషన్... జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఎన్నికలు జరపాలని భావించిన విషయాన్ని గవర్నర్‌కు తెలియజేశారు. కరోనా దృష్ట్యా నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం చెబుతోందని... టీకాల వల్ల ఎన్నికలకు ఎలాంటి అసౌకర్యం ఉండబోదని పేర్కొన్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఎన్నికల ప్రకటనకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిందని వివరించారు. తమ ఉత్తర్వులపై ప్రత్యేక బెంచ్ న్యాయమూర్తి ఎం.గంగారావు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వెంటనే డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశామని చెప్పారు.
ఏ ఉద్దేశంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చామనే విషయాన్ని ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేశ్ తెలియజేశారు. ఎన్నికల ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు మీడియా సమావేశాలు నిర్వహించి ఎస్ఈసీ చర్యపై విమర్శలు చేయడం... తమ కార్యాలయంలోని ఉద్యోగులను సైతం జగన్ ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తన నియామవళి తొమ్మిదో తేదీ నుంచి అమల్లో ఉంటుందని... ఎస్ఈసీ కార్యాలయంలోని ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలని... ముందస్తు అనుమతి తీసుకోకుండా సెలవుపై వెళ్లొద్దని కోరామని గవర్నర్ దృష్టికి తెచ్చారు.
తమ కార్యాలయంలోని సంయుక్త సంచాలకులు సాయిప్రసాద్ ముందస్తు అనుమతి లేకుండా నెలరోజులపాటు సెలవుపై వెళ్తున్నట్లు లేఖను పంపించారని... అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. మరికొందరు ఉద్యోగులను కూడా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా వైకాపా ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులను ఎస్ఈసీకి సహకరించకుండా ఏపీ ప్రభుత్వం పరోక్షంగా వారిని ప్రోత్సహిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రకటన నుంచి ఇంతవరకు జరిగిన పరిణామాలన్నింటినీ లిఖిత పూర్వకంగా గవర్నర్ ముందు ఉంచిన ఎస్ఈసీ.. అందులోని అంశాలను వివరించారు.
శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ కావాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భావించినప్పటికీ మంగళవారం అపాయింట్‌మెంట్ లభించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: కిడ్నాప్ ప్లాన్ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు?