సుప్రీంకోర్టు ఎస్‌ఈసీని సమర్థించిన విషయాన్ని గవర్నర్‌కు తెలిపానని ఏరీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... సుప్రీంకోర్టు నిర్మాణాత్మక సూచనలు చేసిందన్నారు. సీఎస్, డీజీపీతో తనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని తెలిపారు. అధికారులతో తనకు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయన్న ఆయన... ఎస్‌ఈసీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సంయమనంతో మాట్లాడాలని కోరారు.
నేను ఎవరి ప్రాపకం కోసమో అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఓ మంత్రి విమర్శించారు. నేను అధికారులను కేవలం సెన్సూర్ చేశాను. ఎవరిపై వ్యక్తిగతంగా కక్ష సాధించట్లేదు. నేను సర్వీసు వ్యవస్థ నుంచే వచ్చాను. రూల్ ఆఫ్ లాను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఉద్యోగసంఘాల నాయకులు దురుసుగా మాట్లాడినా మనసులో పెట్టుకోను. నేను ఓ ప్రభుత్వ ఉద్యోగినే.. కాకపోతే కాస్త పెద్ద ఉద్యోగిని - నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఎస్ఈసీ
వివరణ కోరాను...
ఏకగ్రీవాలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పత్రికలో ప్రకటన ఇచ్చిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటన పట్ల నాలుగైదు పార్టీలు ఎస్ఈసీని సంప్రదించాయని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా ఎస్‌ఈసీ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలపై ప్రకటన ఇచ్చేటపుడు ఎస్‌ఈసీని సంప్రదించాల్సి ఉందని గుర్తు చేశారు. పత్రికా ప్రకటనను ఐ అండ్ పీఆర్ విభాగం ఇచ్చిందని... దీనిపై వివరణ కోరానని వివరించారు.
విచారణ కొనసాగుతోంది
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై అనేక ఆరోపణలున్నాయని నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. వీటిల్లో జరిగిన అక్రమాలపై ఎస్‌ఈసీ విచారణ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవాలకు ఎవరూ అభ్యంతరం చెప్పరని... కానీ ఆ ప్రక్రియ అసంబద్ధంగా పెరిగితే ఎస్‌ఈసీ పరిశీలిస్తుందని అన్నారు. పార్టీల ఆందోళనల వల్ల ఏకగ్రీవాలపై పరిశీలించి నిర్ణయించాలని కలెక్టర్లకు చెప్పామని వెల్లడించారు.
ఇదీ చదవండి: పీఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళన