నూతన ఇసుక విధానంతో ప్రజలకు లబ్ధి జరుగుతుందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జి.కె.ద్వివేది అన్నారు. ఇసుక తవ్వకాలను ప్రైవేటు కంపెనీకి అప్పగించడంపై మీడియా సమావేశం నిర్వహించారు. కొత్త విధానం ప్రకారం ప్రజలు ఏ రీచ్ నుంచైనా ఇసుక తీసుకెళ్లవచ్చని స్పష్టం చేశారు. ప్రజలు సొంత వాహనంలోనూ ఇసుక తీసుకెళ్లవచ్చని.. నాణ్యత పరిశీలించి నచ్చిన చోట ఇసుక పొందవచ్చన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్‌ల్లోనూ ఒకే ధర ఉంటుందని ద్వివేది వెల్లడించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా ఇసుక కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు. ఇసుక తవ్వకాలపై ఏడు సంస్థలను సంప్రదించామన్న ఆయన.. ఆయా సంస్థలు ముందుకు రాలేదన్నారు. టెండర్ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీతో జనవరి 4న ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. ఇసుక టెండర్ విధానం పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా చేశామని తేల్చి చెప్పారు.
'ఏ రీచ్ నుంచైనా ప్రజలు ఇసుక తీసుకెళ్లవచ్చు. సొంత వాహనాల్లో తరలించవచ్చు. రీచ్లనూ కూడా ఎంపిక చేసుకోవచ్చు. వాహన సదుపాయం కల్పించే చర్యలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే 14500కి ఫిర్యాదు చేయవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. డోర్ డెలివరీ సదుపాయం ఇకపై ఉండదు'- గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి
ఇదీ చదవండి: బోయిన్‌పల్లి పీఎస్‌లో లొంగిపోయిన అఖిలప్రియ భర్త, సోదరుడు