ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. దీని కోసం 958 హళ్లను ఏర్పాటు చేశారు. 609 మంది ఎన్నికల అధికారులు... 1,047 మంది సహాయ ఎన్నికల అధికారులు... 11,227 మంది పర్యవేక్షకులు... 31,133 మంది సహాయ పర్యవేక్షకులు విధుల్లో పాల్గొన్నారు.
తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియ సమీక్షకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటినా లెక్కింపు పూర్తి చేసి... విజేతలను ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. మూడు రౌండ్లలో ఫలితాలు వెలువడేలా ఏర్పాట్లు చేశారు. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలు నిషేధించారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు చేస్తున్నారు.