ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూసేకరణ చట్ట విబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంప్రదింపులు ' ద్వారా భూమిని సేకరించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ భాజపా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు . తాజాగా ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది . కౌంటర్ వేయడానికి ప్రభుత్వ న్యాయవాది సుభాష్ మరికొంత సమయం కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వివి సతీష్ వాదనలు వినిపిస్తూ .. భూసేకరణ చట్టం నిబంధనలను విస్మరించి ప్రైవేటు సంప్రదింపుల ద్వారా అధికారులు భూ సేకరణ చేశారన్నారు. ఆ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదన్నారు.ఈనెల 25 న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నందున మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
భూసేకరణ ద్వారా ప్రభావితమైన సంబంధిత యజమాని కోర్టును ఆశ్రయించిన నాడు ... మధ్యంతర ఉత్తర్వులిచ్చే ప్రశ్న ఉత్పన్నం అవుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యవహారం పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం , ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన భూసేకరణ ప్రక్రియలో కోర్టుల జోక్యం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. భూసేకరణ ప్రక్రియ కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థించడంతో ధర్మాసనం ఆ మేరకు అదేశాలిచ్చింది .
పట్టాలిస్తే కోటి మంది ఓటర్లు తరలివెళ్లాలి....
ఈనెల 25 న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది డీఎస్ ఎన్వీ ప్రసాదబాబు హైకోర్టు ముందు ప్రస్తావించారు. విజయవాడ ప్రజలకు గుంటూరు జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారని తెలిపారు . రాజమండ్రి పట్టణ ప్రజలకు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్థలాలు కేటాయిస్తున్నారన్నారు. తిరుపతి పట్టణ ప్రజలకు ... శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్ర మొత్త మీద 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తున్నారని... ఒక్కో కుటుంబంలో ముగ్గురు ఓటర్లున్నా... కనీసం కోటి మంది వేరే నియోజకవర్గానికి తరలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఫలితంగా శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు దారితీసే పరిస్థితి ఉంటుందన్నారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది బలహీన వర్గాలు , ఎస్సీ , ఎస్టీలకు చెందినవారు కావడంతో ఆ నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ , జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం స్పందిస్తూ ... ఇలాంటి సున్నితమైన విషయంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ముందుకు తీసుకెళ్లడం ఉత్తమం అని అభిప్రాయం వ్యక్తం చేసింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని పేర్కొంది . వాస్తవమేనని బదులిచ్చిన న్యాయవాది ... తన వాదనలతో కోర్టును సంతృప్తి పరుస్తానన్నారు. ఈ వ్యాజ్యాలపై గురువారం విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
ఇదీ చదవండి: కాళేశ్వరం తాజా అంచనా వ్యయంపై కసరత్తు... త్వరలోనే స్పష్టత..!