High Court on Padayatra: ఏపీలో అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ జరిగింది. పాదయాత్రకు 2 వేల మందికి అనుమతి కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేయగా... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ సోమయాజులు బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ ముందు ఆసక్తికర వాదనలు జరిగాయి. అమరావతి పరిరక్షణ సమితి తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పాదయాత్రలో 600 మందే పాల్గొనాలని నిర్దేశించటం సరికాదని అదినారాయణరావు కోర్టుకు విన్నవించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు అందరికీ ఉంటుందని తెలిపారు. రాజధాని కోసం రైతులు 29 వేల మంది భూములు ఇచ్చారన్నారు.
ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని అమరావతిపై తాము స్పష్టంగా తీర్పు చెప్పిన తర్వాత నిరసనలు ఎందుకని ప్రశ్నించారు. అయితే హైకోర్టు తీర్పును... ప్రభుత్వం అమలు చేయటం లేదని ఆదినారాయణరావు తెలిపారు. మూడు రాజధానుల బిల్లు మళ్లీ తెస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిందన్నారు. పాదయాత్రకు పోటీగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం కోర్టు దృష్టికి తెచ్చారు. వాళ్లకు లేని ఆంక్షలు... రైతులకు మాత్రమే ఎందుకని న్యాయవాది అన్నారు.
ఏపీ ప్రభుత్వమే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని ర్యాలీలు చేయిస్తోందని ఆదినారాయణరావు కోర్టుకు చెప్పారు. హైకోర్టు విషయంపైనా తమ తీర్పులో స్పష్టంగా ఉందని న్యాయమూర్తి తెలిపారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిందని, అక్కడ విచారణ జరుగుతున్న విషయం ప్రస్తావనకు తెచ్చారు. ప్రభుత్వం తరఫున కౌంటర్లు దాఖలు కాకపోవడంతో విచారణ వాయిదా వేస్తున్నట్లు డివిజన్ బెంచ్ వెల్లడించింది. తదుపరి విచారణ ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: