ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ నియంత్రణ నిబంధనల్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. అన్లాక్ 5 నిబంధనల అనంతరం ఈ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేసేలా జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు, వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసింది. నో మాస్క్-నో ఎంట్రీ నిబంధనను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. మాస్కు ధరించటం, చేతులు సబ్బు లేదా సానిటైజర్తో శుభ్రపరుచుకోవటం, భౌతిక దూరం లాంటి కీలకమైన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించేందుకు వీలుగా 3 నిమిషాల సంక్షిప్త ప్రచారం చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సూచనలు జారీ చేసింది. నో మాస్క్-నో ఎంట్రీ, శానిటైజేషన్, సామాజిక దూరం పాటింపు వంటి అంశాలపై ప్రతి వారం నివేదికలివ్వాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది.
నిబంధనలు పాటించేలా ప్రచారం
అన్లాక్-5 అనంతరం సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు, రైతు బజార్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకోనుండటం వల్ల అన్ని చోట్లా మాస్కులు, భౌతికదూరం, శానిటైజర్ లేదా చేతులు శుభ్రపరుచుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర హోంశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు సాఫీగా జరిగేందుకు ప్రైవేటు యాజమాన్యాలకు అవగాహన కల్పించాలని సూచనలు విడుదల చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీల లాంటి ప్రజా రవాణా సాధనాల్లో తప్పక కొవిడ్ నియంత్రణ మార్గదర్శకాలకు సంబంధించి సమాచారం ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లోనూ ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసిన ప్రభుత్వం, మతపెద్దలు కూడా కొవిడ్ నియంత్రణ కార్యాచరణను ప్రజలు పాటించేలా ప్రచారం చేయాలని సూచనలు ఇచ్చింది.
మార్గదర్శకాలు
- వాణిజ్య దుకాణాలు, చౌకదుకాణాల ప్రవేశమార్గం వద్దే కొవిడ్ నిబంధనలు ప్రదర్శించాలి
- మాస్కు లేకపోతే సేవలు నిరాకరించాలి
- షాపింగ్ మాల్స్, దుకాణాలు, సినిమా థియేటర్లు, వినోద ప్రాంతాలు, ఫంక్షన్ హాళ్లు ఇతర బహిరంగ ప్రాంతాలకు మాస్క్ లేకపోతే ప్రవేశం నిరాకరించాలి
- కొవిడ్ నిబంధనలు పర్యవేక్షణకు ఒక ఉద్యోగిని నియమించేలా చర్యలు చేపట్టాలి
- ప్రతీ ప్రభుత్వ ప్రకటన, వెబ్ సైట్లలోనూ కొవిడ్ నియంత్రణ మార్గదర్శకాలను కనీసం మూడు లైన్లలో ప్రచురించటం, ప్రసారం చేయాలి
- ప్రభుత్వ, ప్రైవేటు దుకాణాల్లోని ప్రతీ బిల్లులోనూ మాస్క్, చేతుల శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించేలా జాగ్రత్తలను ప్రచురించాలి. ఇప్పటికే ముద్రించిన వాటిపై స్టాంపు వేయాలి
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మైకుల ద్వారా మాస్క్ ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవటం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిపై ప్రచారం చేయాలి
- టెలివిజన్ ఛానళ్లు, ఎఫ్ఎం ఛానళ్లు, ఆల్ ఇండియా రేడియో...ఈ మార్గదర్శకాలను సంక్షిప్తంగా ప్రజలకు అందించేలా ప్రకటనలు ఇవ్వాలి(ప్రతీ గంటకూ ఈ ప్రకటన ఉండాలి)
- ప్రజలు సమావేశమయ్యే ప్రతీ సందర్భంలోనూ అధికారిక, అనధికారిక లేదా కుంటుంబ సమావేశాల్లోనూ ముందుగా కొవిడ్ నియంత్రణ మార్గదర్శకాల ప్రచారంతోనే మొదలుపెట్టాలి
- సినిమా థియేటర్లలోనూ మాస్కు ధరించటం, శానిటైజేషన్, భౌతిక దూరానికి సంబంధించి ప్రచార ప్రకటనలు వేయాలి
- పాఠశాలలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోటా కొవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని విధిగా ప్రచారం చేయాలి
- విద్యా సంస్థల్లో ప్రతీ పిరియడ్ తర్వాత అధ్యాపకులు విద్యార్ధులకు ఈ జాగ్రత్తలు చెప్పాలి
- కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రచారంలో భాగంగా మాస్కే కవచం ప్రకటనలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్లలో ప్రచారం చేయాలని సమాచార పౌరసంబంధాల శాఖకు సూచనలు ఇచ్చింది.
ఇదీ చదవండి : ధరణి పోర్టల్ నిర్వహణ కోసం శనివారం నుంచి శిక్షణ