'భయపడి స్థానిక ఎన్నికలకు వాయిదా కోరడం లేదు.. ప్రజల ఆరోగ్యం ముఖ్యం.. రాజకీయాలు కాదు. ఏపీ హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తా'మని ఆ రాష్ట్ర సాంఘీక సంక్షేమ మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమే.. కానీ, ప్రస్తుతం ఎన్నికలకు అనుకూలమైన వాతావరణం లేదని.. కొవిడ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఏపీ హైకోర్టు తీర్పు తాము ఆశించినట్లు లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ పేర్కొంది. ఉద్యోగుల్లో కరోనా భయం ఎక్కువగా ఉందని తెలిపింది. టీకా పంపిణీ పూర్తయ్యాక ఎన్నికలు జరపాలని కోరినట్లు ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. కరోనా భయంతో అనేకమంది సెలవుల్లో ఉన్నారని వెల్లడించారు.
వేలమందికి కరోనా సోకింది, వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఉద్యోగులకు టీకా పంపిణీ జరుగుతోంది. అది పూర్తయ్యాక ఎన్నికలు పెట్టాల్సిందిగా మా న్యాయబద్ధమైన కోరిక. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత మేం కూడా ఎన్నికలకు సిద్ధమే. సుప్రీం కోర్టులో అప్పీలు వేయాలని నిర్ణయించాం. సుప్రీం కోర్టులో మా వాదన కూడా వినిపిస్తాం. ఉద్యోగులపై అంత ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది. మరో రెండు నెలలు పాటు వాయిదా వేస్తే ఏమవుతుంది?
ఏపీ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి
ఇంత పట్టుదల సరికాదు: మంత్రి కన్నబాబు
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామని.. మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అయితే కరోనా సమయంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నా.. ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదల మాత్రం సరికాదన్నారు. కమిషన్ ఆలోచన వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు.