నివర్ తుపానుపై ఏపీ మంత్రివర్గంలో చర్చించామని ఆంధ్రప్రదేశ్ వ్యవయసాయశాఖ మంతి కన్నబాబు తెలిపారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైదని వివరించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని... ఎత్తు ఒక్క సెంటీమీటర్ కూడా తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాస్తవ డిజైన్‌ల ఆధారంగానే పోలవరం నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
'తుపాన్ ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 28.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 10 వేలమందికి పైగా సహాయ శిబిరాలకు తరలించాం. 30 వేల హెక్టార్టలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 1300 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని ఏపీ సీఎం ఆదేశించారు. డిసెంబర్ 15 కల్లా పంటనష్టం అంచనాల రూపకల్పన చేయాలి ఏపీ సీఎం ఆదేశించారు. డిసెంబర్ 30 కల్లా పరిహారం చెల్లిస్తాం. అంగన్‌వాడీ, హోంగార్డుల బకాయిలు చెల్లించాలని నిర్ణయించాం.' - కన్నబాబు, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి
డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించామని వివరించారు. తొలిదశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్న ఆయన.... 2022 జూన్ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు. అర్హులైన మహిళలకు మేకలు, గొర్రెలు ఇవ్వాలని నిర్ణయించామని... యూనిట్‌కు 14 మేకలు లేదా గొర్రెలు ఉంటాయన్నారు. ఈ పథకాన్ని డిసెంబరు 10న ఏపీ సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. పశువుల దాణాను కల్తీ చేస్తే జరిమానా, జైలుశిక్ష విధించేలా బిల్లు తీలసుకొస్తామని... పశువుల ఆరోగ్యం బాగుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ఆక్వా రంగం అభివృద్ధికి ఏపీ ఫిషరీస్ చట్టం తెస్తున్నామన్నారు.
- ఇదీ చూడండి : హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే భాజపాకు పట్టం కట్టండి: బండి