లింక్-2లో జలాల తరలింపునకు కసరత్తు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-2కు జలాలు తరలించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి అనుసంధాన క్రతువు పూర్తి చేసుకున్న ప్రాజెక్టులో రెండో దశలోనూ జలాల తరలింపును చేపట్టేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నెల 5న నీటిని మళ్లించడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించించారు.
లింక్-1లో విజయవంతంగా నీటి ఎత్తిపోత
మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి, అన్నారం నుంచి సుందిళ్ల బ్యారేజీకి అక్కడి నుంచి ఎల్లంపల్లికి అంటే... లింక్-1లో విజయవంతంగా నీటిని ఎత్తిపోశారు. మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడం వల్ల... ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు - లింక్-2కు నీటిని మళ్లించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
ఎల్లంపల్లి పంపుహౌజ్‌లో ఐదు మోటార్లు సిద్ధం
మేడిగడ్డ నుంచి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా ఎల్లంపల్లిలోకి ప్రవాహం వస్తుండటం వల్ల మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించకుండా నిలిపివేశారు. ఎల్లంపల్లి నుంచి నీటిని మళ్లించే పంపుహౌజ్ సిద్ధమైంది. ఏడు మోటార్లకు ఐదు సిద్ధం కాగా సొరంగమార్గం చివరిదశ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
వరద కాల్వ నుంచి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నీరు
ఎల్లంపల్లి పంపుహౌజ్ నుంచి ఎత్తిపోసే నీరు ఐదున్నర కిలోమీటర్లు కాల్వలో ప్రవహించి శ్రీరాంసాగర్ వరద కాల్వలోకి వస్తుంది. దీని నుంచి మధ్యమానేరుకు చేరుతుంది. వరద కాల్వ నుంచే ఎస్సార్ఎస్పీ పునరుజ్జీవ పథకానికీ మళ్లిస్తారు. ఈ లిఫ్టు పని కూడా దాదాపు పూర్తయింది. మొత్తమ్మీద వచ్చే వారంలో కాళేశ్వరం రెండో అనుసంధానం ద్వారా కూడా నీటిని మళ్లించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.